Sanjay Gandhi: కలకలం రేపుతోన్న సంజయ్ గాంధీ ఫ్లాష్‌బ్యాక్ పోస్ట్
ABN , Publish Date - Jul 10 , 2025 | 07:10 PM
కాంగ్రెస్ నాయకత్వంతో తనకున్న విభేదాలను మరింత పెంచే అవకాశం ఉన్న మరో చర్యకు ఉపక్రమించారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి.. అప్పటి చర్యల్ని బహిర్గతం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ నాయకత్వంతో తనకున్న విభేదాలను మరింత పెంచే అవకాశం ఉన్న మరో చర్యకు ఉపక్రమించారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిపై ఒక వ్యాసం రాసిన ఆయన, అత్యవసర పరిస్థితి సమయంలో జరిగిన అతిక్రమణలను, వాటి నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు అంటూ తన అభిప్రాయాల్ని సదరు వ్యాసంలో వ్యక్తపరిచారు. అంతేకాదు, ఆ అతిక్రమణలను ఎలా తక్కువగా చూపించారో కూడా థరూర్ ఎత్తి చూపారు. ఇది తన పార్టీ సహచరులను లక్ష్యంగా చేసుకునేదిగా ఉండటం కాంగ్రెస్ పార్టీలో మరింత కలవర పాటుకు కారణమవుతోంది.
ఇలా ఉండగా, 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 25 - అత్యవసర పరిస్థితి ప్రకటించిన రోజును 'సంవిధాన్ హత్య దివస్'గా పాటించడం ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఏడాది ఆ రోజుకు మరింత ప్రాచుర్యం దక్కేలా మోదీ సర్కారు కార్యక్రమాలు కూడా చేపట్టింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన హయాంలో దేశ వ్యాప్తంగా ప్రకటించిన అత్యవసరపరిస్థితి.. ఆ క్రమంలో జరిగిన అరాచకాలను భావి భారతావనికి చాటిచెప్పాలని చూస్తోంది మోదీ సర్కారు. అయితే, ఇప్పుడు ఇదే అంశం మీద స్వంత కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన శశిథరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏమాత్రం మింగుడు పడేవికావు. ఇప్పటికే మోదీ సర్కారుకు మద్దతు తెలుపుతున్నారంటూ శశిథరూర్ మీద కాంగ్రెస్ హై కమాండ్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.
ఒక వైపు బీజేపీ చేస్తున్న జూన్ 25 అత్యవసర పరిస్థితి ప్రచారాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోంది. అది 'అప్రకటిత అత్యవసర పరిస్థితి' అంటూ కవర్ చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సాక్షాత్తూ ఆ పార్టీ సీనియర్ నేత అయిన శశిథరూర్ అదే అంశంపై కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టేలా మాట్లాడుతుండటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ఇక, దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ఇటీవల 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ మలయాళ డైలీకి శశిథరూర్ తాజాగా ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో అప్పటి పరిస్థితుల్ని ప్రస్తావించారు శశిథరూర్.
ఆ వ్యాసంలో.. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ రోజులను కేవలం చీకటి అధ్యాయంగా మాత్రమే గుర్తుంచుకోకూడదన్న శశిథరూర్.. దాన్నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయన్నారు. ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ వ్యవహరించిన తీరును శశిథరూర్ బయటపెట్టారు. నాడు ఆయన బలవంతంగా జరిపించిన కుటుంబ నియంత్రణ (వాసెక్టమీ) ఆపరేషన్లను ఎవరూ మర్చిపోలేరన్నారు. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు దాదాపు రెండేళ్ల పాటు దేశంలో విధించిన ఎమర్జెన్సీ కాలంలో అదుపులేని శక్తి నిరంకుశత్వం రాజ్యమేలిందన్నారు. ఆ తర్వాత సదరు చర్యల్ని ‘దురదృష్టకరంగా’ అభివర్ణించినప్పటికీ.. ఆ రోజులను ఎవరూ మర్చిపోలేరని థరూర్ రాసుకొచ్చారు.
ప్రస్తుతం మనం స్వావలంబనతో ముందుకుసాగుతున్నాం. ఎమర్జెన్సీ కాలం ఇప్పుడున్న ఇండియాలా లేదు. ఆ సమయంలో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో మురికివాడలను నిర్దాక్షిణ్యంగా నాశనం చేశారు. వేలాది మంది అభాగ్యుల్ని నిరాశ్రయులుగా మిగిల్చారు. వారి సంక్షేమం గురించి పట్టించుకోలేదు. ప్రాథమిక హక్కులను అణగదొక్కారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకున్నారు. ఇవన్నీ భారత రాజకీయాల్లో మాయని మచ్చగా మిగిలాయని థరూర్ తన వ్యాసంలో ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి
ఇన్‌కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి