Shashi Tharoor: ట్రంప్, న్యూయార్క్ మేయర్ భేటీపై శశిథరూర్ ఆసక్తికర పోస్ట్
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:53 PM
నరేంద్ర మోదీ నుంచి నిన్నమొన్న ఎల్‌కే అడ్వాణీ వరకూ పలు సందర్భాల్లో సానుకూల వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి ఆసక్తికర పోస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి నిన్నమొన్న ఎల్‌కే అడ్వాణీ వరకూ పలువురిపై సానుకూల వ్యాఖ్యలు చేసి సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) మరోసారి ఆసక్తికర పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), కొత్తగా ఎన్నికైన న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్‌దానీ (Zohran Mamdani) వైట్‌హౌస్‌లో శుక్రవారంనాడు కలుసుకున్నారు. స్నేహపూర్వకంగా సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శశిథరూర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షేర్ చేశారు. వీరి కలయిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉందన్నారు. ఎన్నికల సమయంలో విమర్శలు చేసుకున్నప్పటికీ ఎన్నికల ముగిసిన తర్వాత సామరస్యపూర్వకంగా కలుసుకోవడం అభినందనీయమన్నారు.
'ప్రజాస్వామ్యం అంటే ఇలా పనిచేయాలి. ఎన్నికల్లో సిద్ధాంతాల కోసం పోరాడాలి. ఇందుకోసం ఎంతవరకైనా వెళ్లాలి. అయితే ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారం దేశ ప్రయోజనాల కోసం నేతలు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇండియాలో కూడా ఇలాంటి స్ఫూర్తిని చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా నావంతు కృషి చేసేందుకు ప్రయత్నిస్తున్నాను' అని శశిథరూర్ ఆ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, థరూర్ వ్యాఖ్యలను బీజేపీ ప్రశంసించింది. కాంగ్రెస్ నేతలు గాంధీ కుటుంబం కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలనే అభిప్రాయం పరోక్షంగా శశిథూరర్ వెల్లడించినట్టు బీజేపీ అధికార ప్రతినిధ షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. రెండ్రోజుల క్రితం కూడా రామ్‌నాథ్ గోయెంకా స్మారకోపన్యాసంలో మోదీ చేసిన ప్రసంగాన్ని శశిథరూర్ ప్రశంసించారు. థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇప్పటికే గుర్రుమంటోంది. అంత అయిష్టంగా పార్టీలో కొనసాగడం ఎందుకంటూ పలువురు నేతలు ఆయనను నిలదీస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదు.. మోహన్ భాగవత్
తేజస్ ప్రమాదం.. ఇంతకీ ఎవరీ నమాన్ష్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.