Share News

Congres Rally On Vote Chori: ఓట్ చోరీకి వ్యతిరేకంగా డిసెంబర్ 14న రామ్‌లీలాలో కాంగ్రెస్ ర్యాలీ

ABN , Publish Date - Nov 22 , 2025 | 03:58 PM

కాంగ్రెస్ 'మహా ర్యాలీ' వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి (కేసీ వేణుగోపాల్) వివరిస్తూ, డిసెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.

Congres Rally On Vote Chori: ఓట్ చోరీకి వ్యతిరేకంగా డిసెంబర్ 14న రామ్‌లీలాలో కాంగ్రెస్ ర్యాలీ
Congress Rally

న్యూఢిల్లీ: ఎన్నికలు ఏవైనా ఓట్ల చోరీతోనే బీజేపీ అధికారంలోకి వస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహసిస్తోందని కొద్దికాలంగా ఎడతెగని విమర్శలు కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన వాదనను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా 'ఓట్ చోరీ'కి వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో డిసెంబర్ 14న భారీ ర్యాలీ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణను ఈ సభలో హైలైట్ చేయనుంది.


కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఓటు దొంగల కబంధ హస్తాల నుంచి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని విడిపించేందుకు జరుపుతున్న పోరాటానికి ఇది ఆరంభమని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ 'మహా ర్యాలీ' వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వివరిస్తూ, డిసెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కమ్మేస్తున్న అతిపెద్ద ప్రమాదం ఓట్ చోరీ అని, దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా రామ్‌లీలా నుంచి గట్టి సందేశాన్ని ప్రజల్లోకి పంపుతామని తెలిపారు.


'బోగస్ ఓట్లను చేర్చడం, విపక్ష అనుకూల ఓటర్లను తొలగించడం, పెద్ద ఎత్తున ఎన్నికల జాబితాల్లో అవకతవకలకు పాల్పడటం వంటి దుష్ట పన్నాగాలకు బీజేపీ-ఈసీఐ పాల్పడుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది సంతకాలు మాకు అందాయి. నిబంధనలను ఈసీఐ ఏవిధంగా తుంగలో తొక్కుతోందో, ఎంసీసీ ఉల్లంఘనలను బేఖాతరు చేస్తోందో, పట్టపగలే డబ్బులు పంచుతూ బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే ఏవిధంగా సహకరిస్తోందో ప్రజలందరికీ తెలుసు' అని కేసీ వేణుగోపాల్ విమర్శించారు.


నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు వివక్షాపూరితంగా వ్యవహరిస్తూ ఎన్నికల వ్యవస్థను కళ్లముందే ధ్వంసం చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోలేమని చెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాల అనంతరం జరిపిన సమీక్షా సమావేశంలోనే ఓట్ చోరీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించాలనే నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుందన్నారు. బీహార్ ఫలితాలకు ఓట్ చోరీనే కారణమన్నారు. ఇందుకు ప్రధాని, హోం మంత్రి, ఎన్నికల కమిషన్ కలిసి భారీ వ్యూహం పన్నాయని ఆరోపించారు.


కాగా, ఓట్ చోరీపై రాహుల్ గాంధీ గత ఆగస్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానంతరం కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ నుంచి సంతకాల ఉద్యమం ప్రారంభించింది. కర్ణాటక కాంగ్రెస్ 1.12 కోట్ల సంతకాలు సేకరించగా, పంజాబ్ యూనిట్ 27 లక్షల సంతకాలను సేకరించి పార్టీ అధిష్టానానికి అందజేసింది. ఇతర రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ విభాగాలు సంతకాల సేకరణ జరిపాయి.


అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉగ్ర మూలాలు.. 600 మంది విద్యార్థుల జీవితం నాశనం!

తేజస్ ప్రమాదం.. ఇంతకీ ఎవరీ నమాన్ష్..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 22 , 2025 | 04:23 PM