Supreme Court: ఆ పోస్టులు కలవరపరచడం లేదా
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:39 AM
భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, మాట్లాడేటప్పుడు స్వయం నియంత్రణను పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది.

భావ ప్రకటన.. స్వీయ నియంత్రణ
సోషల్‌మీడియాలో కంటెంట్‌పై ప్రభుత్వ కట్టడి ఉండాలి.. కానీ సెన్సార్ పద్ధతి సరికాదు
వారంతట వారే దూరంగా ఉండాలి
కొన్ని జాగ్రత్తలతో భావప్రకటన స్వేచ్ఛ మార్గదర్శకాలిచ్చే అంశం ఆలోచిస్తున్నాం: సుప్రీంకోర్టు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కేసులో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 14 : భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, మాట్లాడేటప్పుడు స్వయం నియంత్రణను పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియాలో నిరోధించేందుకు వీలుగా మార్గదర్శకాలు తెచ్చే యోచన చేస్తున్నామని తెలిపింది. ‘ఈ పోస్టులు పౌరులను కలవరపరచడం లేదా?’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. హిందూ దేవతకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్వీట్‌లు పోస్టు చేసిన వ్యవహారంలో వజహత్‌ఖాన్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను గతనెల 9న పశ్చిమబెంగాల్‌లో అరెస్టు చేశారు. అప్పటికే ఆయనపై ఆ రాష్ట్రంతోపాటు ఆరు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దీనిపై వజహత్ ఖాన్ ఆ నెల 23న సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయనకు జూలై 14(సోమవారం) వరకు చట్టపరచర్యల నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆ గడువు ముగియడంతో సోమవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా శర్మిష్ఠ పనోలీ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌పై వజహత్ ఖాన్ ఆరోపణలు చేశారు. ‘‘శర్మిష్ఠ ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా మతపరమైన వీడియోలు పెట్టడంపై నేను ఫిర్యాదు చేశాను.
అయితే, అప్పటికే సోషల్ మీడియాలో నేను ట్వీట్ చేసిన వ్యాఖ్యలకుగాను నన్ను పశ్చిమబెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. నాపై పలు రాష్ట్రాలపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయండి. లేదంటే అన్ని కేసులను కలిపి విచారించండి.’’ అని కోరారు. ఇదే సమయంలో జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. సోషల్‌మీడియాలో వ్యాపించిన విభజన ధోరణులను కట్టడి చేయాల్సిందేనన్నారు. అయితే, దీని అర్థం సెన్సార్‌ను అమలు చేయాలనేది కాదని, తాము స్వయం నియంత్రణల గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. ‘‘భావస్వేచ్ఛను పౌరులు అనుభవించాలనుకుంటే కొన్ని నియంత్రణలను వారు తమకు తాముగా పాటించాలి. ఇలా ఉల్లంఘనలకు పాల్పడరాదు.’’ అని వ్యాఖ్యానించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (2) విధించిన నియంత్రణలు సరిగ్గానే ఉన్నాయన్నారు. ‘‘సోషల్ మీడియాలో పెట్టే కంటెంట్ విషయంలో తప్పనిసరిగా కొంత నియంత్రణ ఉండాలి. అటువంటి పోస్టులకు పౌరులు దూరంగా ఉండాలి. వాటిని షేర్ చేయడం, లైక్ చేయడం చేయరాదు’’ అని కోర్టు సూచించింది. వజహత్ ఖాన్‌కు కల్పించిన రక్షణలను వచ్చే విచారణ వరకు పొడిగించింది.