Share News

Air India Plane Crash: అది మీ కుమారుడి తప్పిదం కాదు.. ఎయిరిండియా దుర్ఘటనపై సుప్రీంకోర్టు

ABN , Publish Date - Nov 07 , 2025 | 02:41 PM

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ఏఏఐబీ దర్యాప్తు స్వతంత్ర దర్యాప్తు కాదని అన్నారు. తన క్లయింట్ స్వతంత్ర దర్యాప్తు కోరుతున్నారని చెప్పారు.

Air India Plane Crash: అది మీ కుమారుడి తప్పిదం కాదు.. ఎయిరిండియా దుర్ఘటనపై సుప్రీంకోర్టు
Air India plane crash

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గత జూన్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం జరగడం దురదృష్టకరమని, ఈ ప్రమాదానికి పైలెట్ తప్పిదమే కారణమని దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. విమాన ప్రమాదంలో మరణించిన ప్రధాన పైలట్ సుమీత్ సబర్వాల్ తండ్రి పుష్కర్ రాజ్ సభర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిష్పాక్షికమైన దర్యాప్తు జరపాలని పిటిషనర్ కోరారు.


జస్టిస్ చంద్రకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్జీతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా... 'విమాన ప్రమాద ఘటన దురదృష్టకరం. మీ కుమారుడిని నిందిస్తున్న భారం మీరు మోయకూడదు. ఆయనను ఎవరూ నిందించలేదు. ఇది పైలట్ తప్పిదమేనని దేశంలోని ఎవరూ విశ్వసించడం లేదు' అని పేర్కొంది. ఏఏఐబీ ప్రాథమిక దర్యాప్తులో ఎక్కడా పైలట్‌‌ను తప్పుపట్టలేదని తెలిపింది.


పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ఏఏఐబీ దర్యాప్తు స్వతంత్ర దర్యాప్తు కాదని అన్నారు. తన క్లయింట్ స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నారని చెప్పారు. ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్స్ నిబంధనల్లోని రూల్ 12 కింద న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. గ్లోబల్ సేఫ్టీ అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.


కాగా, పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్రం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌తో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలన్న విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపింది. గత జూన్‌లో జరిగిన విమాన ప్రమాదం దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఇవి కూడా చదవండి..

వందేమాతర 150వ వార్షికోత్సవం.. ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల

బీజేపీ, ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 07 , 2025 | 03:02 PM