Brazilian Woman Reacts: ఇదేం పిచ్చి
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:55 AM
హరియాణా ఎన్నికల్లో బీజేపీ ఓట్ చోరీపై ‘హైడ్రోజన్ బాంబు’ పేల్చే క్రమంలో.. రాహుల్ గాంధీ ప్రస్తావించిన మోడల్ ఎవరో తెలిసిపోయింది.
దేవుడా మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం!
హరియాణాలో 22 ఓటర్ ఐడీల్లో తన ఫొటో వాడడంపై బ్రెజిల్ మహిళ వ్యాఖ్య
రాహుల్ ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం వెతికిన నెటిజన్లు
హరియాణాలో 22 ఓటర్ ఐడీల్లో తన ఫొటో వాడడంపై రాహుల్ ప్రస్తావించిన మోడల్ స్పందన
న్యూఢిల్లీ, నవంబరు 6: హరియాణా ఎన్నికల్లో బీజేపీ ఓట్ చోరీపై ‘హైడ్రోజన్ బాంబు’ పేల్చే క్రమంలో.. రాహుల్ గాంధీ ప్రస్తావించిన మోడల్ ఎవరో తెలిసిపోయింది. ఆమె బ్రెజిలియనే. కానీ మోడల్ కాదు. పేరు లారిస్సా నెరీ. తన స్నేహితుడైన ఫొటోగ్రాఫర్ మాథ్యూస్ ఫెర్రెరో ఫొటోలకు 2017లో అలా పోజులిచ్చిందంతే! అది తప్ప ఆమె మోడలింగ్ చేసిన ఫొటోలు మరేవీ లేవు. రాహుల్ తన మీడియా సమావేశంలో ఆమె ఫొటోను ప్రదర్శించి.. ‘ఈమె ఎవరు?’ అని ప్రశ్నించడంతో నెటిజెన్లంతా ఆమె ఆచూకీ కోసం గూగుల్‌లో, ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో తెగ గాలించారు. రాహుల్ ప్రదర్శించిన ఫొటో ఆధారంగా ఇమేజ్ సెర్చ్ కూడా చేశారు. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ తెలియరాలేదు. అయితే.. తన ఫొటో ఇంటర్‌నెట్‌లో సెన్సేషన్‌గా మారడంతో లారిస్సా నెరీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించింది. అది తన పాత ఫొటో అని.. ఆ ఫొటో తీసే సమయానికి తన వయసు 18-20 ఏళ్లని తెలిపింది. ‘‘గైస్.. అది పాత ఫొటో.. ఇండియాలో ఎన్నికల కోసమో.. ఓటింగ్‌కు సంబంధించో.. నా ఫొటోను వాడుకుంటున్నారు. ప్రజలను మోసం చేయడానికి నన్ను భారతీయురాలిగా చిత్రీకరిస్తున్నారు. ఇదేం పిచ్చి? ఇదేం వెర్రి? దేవుడా.. మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం’’ అని నవ్వుతూ ఆశ్యర్యం వెలిబుచ్చింది. తాను ప్రస్తుతం ఒక సెలూన్‌లో పనిచేస్తున్నానని.. తన ఫొటో వైరల్ కావడంతో ఒక పాత్రికేయుడు తాను పనిచేస్తున్న సెలూన్‌కు ఫన్ చేసి ఇంటర్వ్యూ కోసం కూడా అడిగాడని తెలిపింది.