RJD: ఆర్జేడీకి ఓట్లు... బీజేపీ, నితీష్‌కు సీట్లు
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:00 PM
సీట్ల షేరింగ్ ఫార్ములాలో భాగంగా 143 సీట్లలో ఆర్జేడీ పోటీ చేసి కేవలం 25 సీట్లలో గెలిచింది. 23 శాతం ఓట్ షేర్ రాబట్టింది. గత ఎన్నికల్లో ఇది 23.11గా ఉంది. గత ఎన్నికల్లోనూ 144 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసింది.
పాట్నా: ఇరవై ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తున్నామంటూ ఢంకా బజాయించిన మహాగఠ్‌బంధన్ (Mahagathbandhan) ఆశలపై బిహార్ ఎన్నికల ఫలితాలు నీళ్లుచల్లాయి. సర్వేల అంచనాల కంటే తక్కువగా సీట్లు రావడం మహాకూటమి నేతలను ఆశ్చర్యంలో ముంచెత్తగా, కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ (RJD)కి ఫలితాలు మింగుడుపడటం లేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆన్ని పార్టీల కంటే ఆర్జేడీకి పడిన ఓట్ల శాతం ఎక్కువగా ఉంది. అయితే సీట్లు మాత్రం బీజేపీ, జేడీయూ ఎగరేసుకుపోయాయి.
ఓట్ షేర్ ఎంతంటే..
సీట్ల షేరింగ్ ఫార్ములాలో భాగంగా 143 సీట్లలో ఆర్జేడీ పోటీ చేసి కేవలం 25 సీట్లలో గెలిచింది. 23 శాతం ఓట్ షేర్ రాబట్టింది. గత ఎన్నికల్లో ఇది 23.11గా ఉంది. గత ఎన్నికల్లోనూ 144 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసింది. బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 19.46 శాతం ఓట్ షేర్ సాధించగా ఈసారి స్వల్పంగా 20.07కు పెరిగింది. 101 సీట్లలో బీజేపీ ఈసారి పోటీ చేసింది. ఆర్జేడీకి 1,15,46,055 ఓట్లు పోల్ కాగా, బీజేపీ 1,00,81,143 ఓట్లు వచ్చాయి.
మహాగఠ్‌బంధన్‌లోని ఆర్జేడీ భాగస్వామ పార్టీ కాంగ్రెస్ సైతం ఫలితాల్లో దారుణంగా చతికిలపడింది. ఆ పార్టీ 61 సీట్లలో పోటీ చేసి కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది. సీపీఐఎంల్ 2, సీపీఐ ఒక సీటు సాధించడంతో మహాకూటమికి దక్కిన సీట్లు 35కు పరిమితమయ్యాయి. ఎన్డీయే 202 సీట్లతో ఘనవిజయం సాధించింది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, జేడీయూ 85 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) 19, మరో కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) 5, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ రాష్ట్రీయ లోక్ మోర్చా 4 సీట్లు గెలుచుకున్నాయి.
ఓట్ షేర్ అంటే..
ఒక రాజకీయ పార్టీ లేదా అభ్యర్థికి వచ్చిన మొత్తం ఓట్లనే ఓట్ షేర్ అంటాం. ప్రజల్లో పార్టీకి లభించిన పాపులారిటీ, దక్కిన మద్దతును ఓట్ షేర్ చెబుతుంది. ఆర్జేడీ అత్యధిక ఓట్ షేర్ సాధించినప్పటికీ నిరాశాజనక ఫలితాలు చవిచూసింది. పలు నియోజవర్గాల్లో రెండు, మూడో స్థానాల్లో నిలవడం, విన్నింగ్ లైన్‌ను దాటకపోవడంతో ఓటు షేర్ పెరిగినా సీట్ కౌంట్ పెరగలేదని అంటున్నారు. విజయానికి అతి చేరువలో వచ్చి ఓటమి పాలైన నియోజకవర్గాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అదీగాక బీజేపీ, జేడీయూ పోటీ చేసిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయడం కూడా ఓట్ షేర్ పెరగడానికి దోహదపడినట్టు విశ్లేషిస్తున్నారు. బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయగా, ఆర్జేడీ అదనంగా మరో 42 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. దీంతో అనేక చోట్ల అభ్యర్థులు ఓడిపోయినా అత్యధిక ఓట్ షేర్ మాత్రం ఆర్జేడీ ఖాతాలోకి వచ్చిచేరింది.
ఇవి కూడా చదవండి..
కేంద్ర మాజీ మంత్రిని సస్పెండ్ చేసిన బీజేపీ
సిక్కు మహిళ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. పాకిస్థాన్ వ్యక్తితో పెళ్లి..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..