Ranya Rao: చిక్కుల్లో రన్యారావు సవతి తండ్రి.. కంపల్సరీ లీవ్‌పై వెళ్లాలని ఉత్తర్వులు
ABN , Publish Date - Mar 15 , 2025 | 09:09 PM
కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా ఉన్న కె.రామచంద్రరావును 'కంపల్సర్సీ లీవు'పై పంపుతూ కీలక ఆదేశాలు వెలువడ్డాయి. తక్షణం ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు.

బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) సవతి తండ్రి, సీనియర్ పోలీసులు అధికారి కె.రామచంద్రావు చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా ఉన్న కె.రామచంద్రరావును 'కంపల్సర్సీ లీవు'పై పంపుతూ కీలక ఆదేశాలు వెలువడ్డాయి. తక్షణం ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఆయనను కంపల్సరీ లీవుపై పంపడం వెనుక కారణాలు ఏమిటనేవి వెంటనే తెలియలేదు.
Ranya Rao: చెంపదెబ్బలు కొట్టారు, తిండిపెట్టలేదు.. డీఆర్ఐ ఏడీజీకి రన్యారావు లేఖ
ఈ నెల ప్రారంభంలో రన్యారావు దుబాయి నుంచి బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకోగానే డీఆర్ఐ అధికారులు ఇటీవల అడ్డుకుని, అక్రమంగా తీసుకువస్తున్న 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాను దుబాయ్, అమెరికా, యూరప్ దేశాల్లో పలుమార్లు పర్యటించినట్టు డీఆర్ఐ విచారణలో తొలుత అంగీకరించిన రెన్యారావు.. తనను అక్రమంగా ఇరికించారని, తాను అమాయకురాలినని చెప్పారు. ఈ నేపథ్యంలో డీఐర్ఐ సమాచారంతో సీబీఐ సైతం దర్యాప్తు బృందాన్ని బెంగళూరు పంపింది. ఎయిర్ పోర్ట్ అధికారులు, సిబ్బంది ఎవరైనా రన్యారావుకు సహకరించారా అనే కోణం నుంచే కాకుండా, డీజీపీ కె.రామచంద్రరావు ప్రమేయంపై కూడా దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి.
నాకేమీ తెలియదన్న రామచంద్రరావు
కాగా, రన్యారావు అరెస్టు వెలుగుచూసిన వెంటనే దీనిపై రామచంద్రరావు స్పందించారు. తనకు కూడా మీడియా వార్తలు చూసిన తర్వాతే అరెస్టు విషయం తెలిసిందని, తాను కూడా అందరిలాగానే దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. రన్యారావు తమతో ఉండటంలేదని, తన భర్తతో వేరేగా ఉంటోందని, వారి మధ్య ఏదైనా కుటుంబ సమస్యలు ఉండవచ్చని అన్నారు. అంతకుమించి చెప్పేదేమీ లేదన్నారు. ఈ క్రమంలోనే రామచంద్రరావుపై వినిపిస్తు్న్న ఆరోపణలపై విచారణకు ఒక అధికారిని కూడా కర్ణాటక ప్రభుత్వం నియమించింది. తాజాగా, ఆయనను 'కంపల్సరీ లీవు'పై వెళ్లాలనే ఆదేశాలు జారీ అయినట్టు ప్రభుత్వం తెలిపింది. రామచంద్రరావు ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలను అడిషనల్ డెరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రిక్రూట్‌మెంట్) కెవీ శరత్ చంద్రకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి..