Rajnath Singh: ఆటమిక్ టెస్ట్ వెంటనే జరపాలి.. రాహుల్‌కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Aug 02 , 2025 | 08:07 PM
రాహుల్ గాంధీ ఇంతకుముందు కూడా పార్లమెంటులో భూకంపం సృష్టిస్తామంటూ మాట్లారని, అవన్నీ అనవసరమైన మాటలేనని రాజ్‌నాథ్ అన్నారు. ఈసీఐ ఎలాంటి సందేహాలకు తావులేని సమగ్రతను కలిగి ఉందని కొనియాడారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు-2024లో 'రిగ్గింగ్' జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) విరుచుకుపడ్డారు. భారత ఎన్నికల కమిషన్ (ECI)పై చేసిన వ్యాఖ్యలను సవాలు చేశారు. ఈసీఐపై ఆయన (రాహుల్) వద్ద ఆధారాలుంటే 'ఆటంబాంబు' పేల్చాలని సవాలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు రిగ్గింగ్ చేయవచ్చనీ, రిగ్గింగ్ చేశారని రాహుల్ చెప్పడానికి ఆధారాలు ఉంటే వాటిని చూపించాలని అన్నారు.
'ఎన్నికల కమిషన్ రిగ్గింగ్ చేసిందనడానికి ఆధారాలతో కూడిన ఆటంబాంబు సిద్ధం చేశానని ఆయన చెబుతున్నారు. ఆటంబాంబు ప్రూఫ్స్ అనేవి ఉంటే ఆయన వెంటనే ఆటమిక్ పరీక్ష జరపాలి. అసలు నిజం ఏమిటంటే.. ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ లేనేలేవు' అని రాజ్‌వాథ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాహుల్ గాంధీ ఇంతకుముందు కూడా పార్లమెంటులో భూకంపం సృష్టిస్తామంటూ మాట్లారని, అవన్నీ అనవసరమైన మాటలేనని రాజ్‌నాథ్ అన్నారు. ఈసీఐ ఎలాంటి సందేహాలకు తావులేని సమగ్రతను కలిగి ఉందని కొనియాడారు.
రాహుల్ వార్షిక లీగల్ సదస్సులో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలను రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పడానికి తన వద్ద ఆధారులు ఉన్నాయని తెలిపారు. ఇండియాలో ఎన్నికలకు ఎప్పుడో కాలంచెల్లిపోయిందని, దీనిపై ఆరునెలల పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేసిందని తెలిపారు. చాలా తక్కువ మెజారిటీతో ప్రధాని తన పదవును నిలబెట్టుకున్నారనీ, 15 సీట్లతో మోదీ ప్రధాని అయ్యారని, ఆ సీట్లు లేకుండా ప్రధాని మోదీకి పదవి దక్కేది కాదన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లక్షన్నర ఓట్లు ఫేక్ అని తెలిందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడతామని చెప్పారు. 100 శాతం తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అరుణ్ జైట్లీపై రాహుల్ వ్యాఖ్యలు.. కస్సుమన్న రోహన్ జైట్లీ
ఓటర్ల జాబితాలో నా పేరు లేదన్న తేజస్వి.. ఈసీ కౌంటర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి