Share News

Raj Thackery: ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే..ఎందుకంటే

ABN , Publish Date - Jul 27 , 2025 | 02:50 PM

మాతోశ్రీ పర్యటనలో భాగంగా రాజ్‌ ఠాక్రే మూడో అంతస్తు వరకూ వెళ్లి శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే గదిని సందర్శించారు. బాల్ ఠాక్రే కూర్చునే 'ఐకానిక్ చెయిర్'ను ఆ గదిలో పదిలపరిచారు. రాజ్ ఆ కుర్చీకి గౌరవపూర్వకంగా నమస్కరించి, బాల్ ఠాక్రేకు నివాళులర్పించారు.

Raj Thackery: ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే..ఎందుకంటే
Raj Thackeray with Uddhav Thackeray

ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ ఠాక్రే (Raj Thackeray) ఆరేళ్ల తర్వాత శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) నివాసమైన 'మాతోశ్రీ' (Matoshree)కి వెళ్లారు. రాజ్, ఉద్ధవ్ సోదరులిరువురూ సుమారు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. వీరి సమావేశానికి ప్రత్యేకత ఉంది. ఆదివారంనాడు ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజు కావడంతో మాతోశ్రీకి వచ్చిన రాజ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ ఠాక్రే వెంట ఎంఎన్ఎస్ సీనియర్ నేతలు బాలా నందగావోంకర్, నితిన్ సర్దేశాయ్ కూడా హాజరయ్యారు. రాజ్‌ఠాక్రే మాతోశ్రీ నిలయానికి వచ్చి దాదాపు ఆరున్నరేళ్లు అవుతోంది. చివరిసారిగా తన కుమారుడు అమిత్ ఠాక్రే పెళ్లికి ఉద్ధవ్‌ను ఆహ్వానించేందుకు ఆయన మాతోశ్రీకి వచ్చారు.


బాల్ ఠాక్రేకు నివాళులు

మాతోశ్రీ పర్యటనలో భాగంగా రాజ్‌ ఠాక్రే మూడో అంతస్తు వరకూ వెళ్లి శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే గదిని సందర్శించారు. బాల్ ఠాక్రే కూర్చునే 'ఐకానిక్ చెయిర్'ను ఆ గదిలో పదిలపరిచారు. రాజ్ ఆ కుర్చీకి గౌరవపూర్వకంగా నమస్కరించి, బాల్ ఠాక్రేకు నివాళులర్పించారు.


కాగా, ఉద్ధవ్-రాజ్ సోదరుల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ మాతోశ్రీతో రాజ్‌కు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. యువకుడిగా ఎక్కువ కాలం తన అంకుల్‌ (బాల్ ఠాక్రే)తో సన్నిహితంగా పార్టీ కోసం ఆయన పనిచేశారు. గతంలో ఉద్ధవ్ సర్జరీ చేయించుకున్నప్పుడు కూడా ఆసుపత్రిలో ఆయనను రాజ్ పరామర్శించారు. ఆసుపత్రి నుంచి ఉద్ధవ్ డిశ్చార్జి అయిన తర్వాత స్వయంగా కారును డ్రైవ్ చేస్తూ ఆయనను మాతోశ్రీకి రాజ్ తీసుకువచ్చారు.


సరైన సమయంలో..

శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్ పొత్తుపెట్టుకోనున్నాయనే ప్రచారం కూడా కొద్దికాలంగా వినిపిస్తోంది. ఈ దిశగా ఇటీవల మూడు రోజుల పాటు జరిగిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన సదస్సులో రాజ్ సంకేతాలిచ్చారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఉద్ధవ్ సైతం ఇందుకు సుముఖత వ్యక్తం చేస్తూ వచ్చారు. హిందీని రాష్ట్ర పాఠశాలల్లో తృతీయ భాషగా తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకుంది. ఇందుకోసం మొదట్నించీ పట్టుబడుతున్న ఠాక్రే సోదరులు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒకేవేదికపై కలిశారు. పొత్తులపై రాజ్, ఉద్ధవ్ వ్యాఖ్యలపై శివసైనికులు సంతోషంగా ఉన్నారని, తిరిగి సోదరులిద్దరూ చేతులుకలిపే అవకాశాలున్నాయని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే పొత్తులకు రాజ్ తలుపులు తెరిచే ఉంచారు.


ఇవి కూడా చదవండి..

హరిద్వార్ మానసా దేవీ ఆలయం వద్ద తొక్కిసలాట.. ఆరుగురి మృతి

నకిలీ రాయబార కార్యాలయం కేసులో వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు.. రూ.300 కోట్లకు పైగా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 02:55 PM