Jagdeep Dhankhar Resignation: ధన్‌ఖడ్‌పై ఒక దశలో అభిశంసన యోచన
ABN , Publish Date - Jul 25 , 2025 | 02:39 AM
ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ పట్ల కొన్నాళ్లుగా బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది.

ఆయనపై తీవ్ర ఆగ్రహంతో బీజేపీ నాయకత్వం
కాంగ్రెస్ పట్ల మెతక వైఖరితో ఉన్నారనే భావన
ఖర్గేకు సభలో పహల్గాం అంశాన్ని లేవనెత్తే అవకాశం ఇవ్వడంపై బీజేపీలో తీవ్ర అభ్యంతరం
జస్టిస్ శేఖర్ యాదవ్ అంశంలోనూ కేంద్రం కినుక
ధన్‌ఖడ్‌కు వీడ్కోలు ఇవ్వడానికీ కేంద్రం ససేమిరా
కాంగ్రెస్ నేత జైరాం ప్రతిపాదించినా స్పందించని వైనం
న్యూఢిల్లీ, జూలై 24: ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ పట్ల కొన్నాళ్లుగా బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది. ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేశానని చెబుతున్నా మొదటి నుంచీ అందరూ వేరే కారణం ఉందని ఊహిస్తూనే ఉన్నారు. దాన్ని బలపరిచే విధంగా బుధవారం మరో సంఘటన జరిగింది. మాజీ ఉప రాష్ట్రపతికి రాజ్యసభ గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని పార్లమెంటులో సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రతిపాదించారు. గురువారం జరిగే తమిళనాడు ఎంపీల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పేరు కూడా చేర్చాలని కోరారు. బీజేపీ మౌనం వహించింది. ఇతర పార్టీలు కూడా ఎందుకో జైరాం ప్రతిపాదనకు మద్దతు తెలపలేదు. దాంతో ధన్‌ఖడ్ వీడ్కోలు లేకుండానే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది నుంచే బీజేపీకి ఆయనకు మధ్య ఎడం పెరిగినట్లు సమాచారం. పైగా, న్యాయవ్యవస్థపై ఆయన కొద్ది నెలలుగా తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. జస్టిస్ వర్మ వ్యవహారంలోనూ న్యాయ వ్యవస్థపై కీలక ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఇబ్బందులు ఉంటాయని గ్రహించిన మోదీ సర్కారు పార్లమెంటు సమావేశాలకు 4 రోజుల ముందు నుంచే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు.
పార్టీ అధ్యక్షుడు నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సీనియర్ నేత అర్జున్ రాం మేఘ్వాల్ రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న ధన్‌ఖడ్‌ను కలిశారు. జస్టిస్ వర్మ తొలగింపునకు లోక్‌సభలో తాము పిటిషన్ పెడుతున్నామని, రాజ్యసభలో విపక్షాలుపెట్టే పిటిషన్లను ముందుకు తీసుకెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అయితే, సోమవారం కాంగ్రెస్ ఇచ్చిన అభిశంసన నోటీసు విషయంలో ధన్‌ఖడ్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. పైగా సభలో పహల్గావ్ దాడి గురించి విపక్ష నేత మల్లికార్జునఖర్గేకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం తరఫున మాట్లాబోయిన నడ్డాను మాట్లాడనివ్వలేదు. దాంతో నడ్డా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. జస్టిస్ వర్మపై కాంగ్రెస్ పెట్టిన తీర్మానాన్ని అనుమతిస్తానని ఉపరాష్ట్రపతి అధికారికంగా ప్రకటించడంతో అప్పటికప్పుడు ఆయనను అభిశంసించేందుకు కూడా ఎన్డీఏ పక్షం సన్నద్ధమైందని సమాచారం. ఆయనపై ఒత్తిడి తేవడమే అప్పటికి బీజేపీ లక్ష్యం. మొదట్లో కాంగ్రె్‌సతో ఉప్పునిప్పుగా ఉన్న ధన్‌ఖడ్ వైఖరి గత డిసెంబరు నుంచి మారిందని బీజేపీ భావిస్తోంది.
డిసెంబరులో కాంగ్రెస్ ధన్‌ఖడ్ మీద అభిశంసనతీర్మానం పెట్టింది. అయితే, దానిపై చర్చ వరకు తీసుకెళ్లే ఉద్దేశం లేకనే లొసుగులతో తీర్మానాన్ని తయారు చేసింది. దాంతో రాజ్యసభ ఆ తీర్మానాన్ని తిరస్కరించింది. అప్పటి నుంచి ధన్‌ఖడ్ కాంగ్రెస్ పట్ల మెతగ్గా ఉన్నారని పేరొచ్చింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్‌పై గతంలో కాంగ్రెస్ పెట్టిన అభిశంసన తీర్మానం వ్యవహారాన్ని రచ్చకాకుండా త్వరగా ముగించాలని కేంద్రం అడిగితే ధన్‌ఖడ్ నానుస్తూ వచ్చి సోమవారం నోటీసు చెల్లదని ప్రకటించారు.
ఇదీ బీజేపీ ఆగ్రహానికి ఒక కారణం. ఇటీవల రైతుల సమస్యలపై ఒక వేదికపై వ్యవసాయ మంత్రిశివరాజ్‌సింగ్ చౌహాన్‌ను తప్పుబట్టారు. ఇదంతా ఒక ఎజెండా ప్రకారం జరుగుతోందని బీజేపీలో అనుమానాలు న్నాయి. దీంతో ఆయనను బలవంతంగా తప్పించినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉపరాష్ట్రపతి హోదాలో గొంతెమ్మ కోర్కెలు కోరారని మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత్‌కు వచ్చినపుడు ఉపాధ్యక్షుడి హోదాలో ఆయన్ను కలుస్తానని ధన్‌ఖడ్ పట్టుబట్టారట. మంత్రుల కార్యాలయాల్లో రాష్ట్రపతి, ప్రధా ని ఫొటోలతోపాటు తన ఫొటో పెట్టాలని డిమాండ్ చేసేవారని, వాహనశ్రేణిలో మెర్సిడెజ్ బెంజ్‌కార్లు కావాలన్నారని కథనాలను ప్రచారం చేశారు. మరో వైపు ఎన్‌డీఏ కొత్త ఉపరాష్ట్రపతి రేసులో బిహార్ మహా నాయకుడు కర్పూరీ ఠాకూర్ తనయుడు, రాష్ట్ర వ్యవసాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ పేరు గట్టిగా వినవస్తోంది. ఆయన బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలవడం ఈ ఊహాగానాలకు తావిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‌లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News