Share News

Election Commission: బిహార్‌లో 35.5 లక్షల ఓట్ల తొలగింపు

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:18 AM

బిహార్‌లో ఎన్నికల కమిషన్‌ ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఐఎస్ఆర్‌ కారణంగా 35.5 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Election Commission: బిహార్‌లో 35.5 లక్షల ఓట్ల తొలగింపు

  • జాబితాలో మృతులు, విదేశీయులు

  • ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి ఓట్లు

  • కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ

పట్నా, జూలై 14: బిహార్‌లో ఎన్నికల కమిషన్‌ (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-ఐఎస్ఆర్‌) కారణంగా 35.5 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈసీ ఇచ్చిన గణాంకాల ఆధారంగా పార్టీలు ఈ అంచనాకు వస్తున్నాయి. ఇంతవరకు 6.6 కోట్ల మంది ఓటర్లు పేరు నమోదు పత్రాలను సమర్పించారని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇది మొత్తం ఓటర్లలో 88.18 శాతానికి సమానమని తెలిపింది. ఫారాల సమర్పణకు ఈ నెల 25 వరకు సమయం ఉందని, ఆ తరువాత జాబితాలను ప్రచురిస్తామని వివరించింది. 12.5 లక్షల మంది అంటే 1.59 శాతం మంది ఓటర్లు చనిపోయారని, వారి పేర్లను జాబితాల నుంచి తొలగిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. మరో 17.5 లక్షల మంది అంటే 2.2 శాతం మంది బిహార్‌ నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లారని, వారి పేర్లను కూడా తీసివేస్తామని పేర్కొంది. ఇంకో 5.5 లక్షల మంది అంటే 0.73 శాతం మంది పేర్లు రెండు చోట్ల ఉన్నాయని, వాటిని కూడా మార్చుతామని వివరించింది. ఈ లెక్కన 35.5 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉంది. ఇది మొత్తం ఓటర్లలో 4.5 శాతానికి సమానమని తేలింది. ఓటర్ల జాబితాల్లో నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ జాతీయుల పేర్లు ఉండడంతో వాటిని కూడా తొలగించాలని నిర్ణయించింది. భారీగా ఓటర్లను తొలగించడంపై విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Updated Date - Jul 15 , 2025 | 05:18 AM