Omar Abdullah: కొందరి ఉగ్రకుట్రలకు కశ్మీరీలందరినీ బాధ్యులను చేయొద్దు.. సీఎం ఆవేదన
ABN , Publish Date - Nov 19 , 2025 | 06:06 PM
జమ్మూకశ్మీర్‌లో రిజిస్టర్ అయిన కారుతో ఢిల్లీకి వెళ్తే అది కూడా ప్రస్తుతం నేరంగా పరిగణిస్తున్నారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు ఘటన అనంతరం కశ్మీర్‌లోని వైద్యులు, దేశంలోని పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న కశ్మీరీ విద్యార్థులను అనుమానంగా చూస్తుండటంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తుల ఉగ్రవాద చర్యలకు కశ్మీరీ ప్రజలందరిని బాధ్యులను చేయడం సరికాదని, ఎక్కడ తమను బాధ్యులను చేస్తారోననే భయంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా కశ్మీర్ ప్రజలు భయపడుతున్నారని అన్నారు.
'ఢిల్లీ ఘటనకు ఏ కొద్దిమందో బాధ్యులు. కానీ మేమంతా (కశ్మీరీలు) బాధ్యులమనే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి మేము ఏమి చెప్పాలి? అది (పేలుళ్ల) ఢిల్లీలో జరగకుండా ఉంటే ఇక్కడ (కశ్మీర్) జరిగి ఉండేది. బాంబు పేలుళ్లు, పౌరలను చంపడం ఆగిపోలేదు. ఇవి ఆగాలి. కశ్మీర్‌లో ఎంతో రక్తపాతం చూశాం. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లలను కశ్మీర్ బయటకు పంపేందుకు తల్లిదండ్రులెవరూ ఇష్టపడం లేదు. ప్రతిచోటా జనం కశ్మీరీలను అనుమానంగా చూస్తున్నారు. వారిపై బురద చల్లుతున్నారు' అని ఒమర్ అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో రిజిస్టర్ అయిన కారుతో ఢిల్లీకి వెళ్తే అది కూడా ప్రస్తుతం నేరంగా పరిగణిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తాను జమ్మూకశ్మీర్ నెంబర్ ఉన్న వాహనంతో ఢిల్లీకి వెళ్లాలంటే ఎక్కడ ఆపి తనిఖీలు చేస్తారోనని భయపడుతున్నట్టు చెప్పారు.
ఫరూక్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ పేలుడు ఘటనపై ఒమర్ అబ్దుల్లా తండ్రి, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్ కాలర్ వైద్యులు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? దీనికి కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. ఇందుకు బాధ్యులను ఈ ప్రశ్నలు అడగాలని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు. రెండు దేశాలు (భారత్-పాక్) తమ సంబంధాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. స్నేహితులను మార్చవచ్చు కానీ పొరుగువారిని మార్చలేమంటూ మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పిన మాటలనే తాను పునరావృతం చేయాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. దేశంలో మళ్లీ ఉగ్రదాడుల నేపథ్యంలో మరో ఆపరేషన్ సిందూర్ ఉంటుందేమోనని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..
ఈడీ కస్టడీకి అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..