Bengaluru News: ఢిల్లీ వెళ్లినా.. మార్పులు లేనట్టేనా..
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:46 PM
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఓ కీలక పదవి వరించే అవకాశాలున్నాయనే వార్తలను పార్టీ వర్గాలు వెల్లడిస్తుండగా.. ఆ పదవి ఏమిటన్నదానిపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
బెంగళూరు: రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు ఉంటాయని, ఎటువంటి నిర్ణయమైనా జరగవచ్చునని రాష్ట్ర పార్టీ నాయకులు భావించారు. అందుకు అనుగుణంగానే కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. 15న ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణకు అనుమతులు తీసుకొస్తానని స్వయానా సీఎం సిద్దరామయ్య రెండువారాలక్రితమే ప్రకటించారు. మరికొందరు ఇదే ముహూర్తమని డీసీఎం డీకే శివకుమార్(DK Shivakumar)కు కీలకమైన పదవి సాధ్యమవుతుందన్నారు. ఇలా మలుపులు తిరిగాయి. మూడురోజులపాటు సీఎం, డీసీఎంలు ఢిల్లీలో ఉండడంతో వివాదం మరింత రచ్చే అయ్యింది.
ఏ క్షణంలో ఎటువంటి సంచలన నిర్ణయమైనా బహిరంగం కావచ్చునని భావించారు. ఇలా మూడురోజులపాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. 15న సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ఢిల్లీ వెళ్లి ఒంటరిగా రాహుల్‌గాంధీని కలిశారు. కాసేపటికే డీసీఎం డీకే శివకుమార్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. రాహుల్‌గాంధీ నేరుగా సిద్దరామయ్యను మళ్లెప్పుడు వస్తారు, అగ్రనేతలు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో చర్చించాలని సూచించారు. సోమవారం ప్రధానమంత్రితో అపాయింట్‌మెంట్ ఉందని, ఢిల్లీలో అందుబాటులో ఉంటానని రాహుల్‌గాంధీకి వివరించారు.

దీంతో ఖర్గే తీసుకునే నిర్ణయం అమలవుతుందని భావించారు. ఈలోగా మూడు రోజులు ఢిల్లీలోనే గడిపిన డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్‌లు ఖర్గేను కలిశారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి తొలుత ప్రధానితో కలసి, ఆ తర్వాత రాత్రి మల్లికార్జును ఖర్గేను భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రధానంగా రాహుల్‌గాంధీ సూచించిన అంశాలను ప్రస్తావించినట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఎటువంటి చర్యలు వద్దంటూ సున్నితంగా ఖర్గే తిరస్కరించినట్టు తెలుస్తోంది.
దీన్నిబట్టి ప్రస్తుతానికి మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణ వంటి అన్ని అంశాలకు తెరపడినట్టు అయ్యింది. ఒకవేళ అధిష్ఠానం అంగీకరించినా మరో 15రోజుల్లో బెళగావిలో శాసనసభ శీతాకాల సమావేశాలు ఉన్నందున ఆ తర్వాతనే విస్తరణ చేయాలని ఆలోచించారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన ముగుస్తున్న తరుణంలో ఎటువంటిమార్పులు, సంచలనాలు లేవని అధిష్ఠానం తేల్చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
సినిమాలకు.. ఇక సెలవు! నటనకు వీడ్కోలు.. పలికిన నటి తులసి
Read Latest Telangana News and National News