RJD: ఓటమితో విచారం, విజయంతో అహంకారం ఉండదు.. తొలిసారి స్పందించిన ఆర్జేడీ
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:58 PM
243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. 2010 తర్వాత దారుణమైన ఫలితాలు వచ్చిన రెండో సందర్భం ఇది. అప్పటి ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 22 సీట్లు గెలుచుకుంది.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఘోరమైన ఫలితాలను చవిచూడటంపై ఆ పార్టీ తొలిసారి స్పందించింది. నిరంతర ప్రజాసేవలో ఒడిదుడుకులు (Up and Down) అనేవి అనివార్యమని పేర్కొంది. ఆర్జేడీ పేదల పార్టీ అని, పేదల మధ్యే ఉంటే వారి వాణి వినిపిస్తూనే ఉంటుందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.
'ప్రజా సేవ ఒక నిరంతర ప్రక్రియ. ఇదొక నిరంతర ప్రయాణం. అందులో ఎత్తుపల్లాలు సహజం. ఓడిపోయినందుకు విచారం, గెలిచినందుకు అహంకారం ఉండదు' అని ఆర్జేడీ పేర్కొంది. 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. 2010 తర్వాత దారుణమైన ఫలితాలు వచ్చిన రెండో సందర్భం ఇది. అప్పటి ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 22 సీట్లు గెలుచుకుంది.
అతిపెద్ద పార్టీ నుంచి..
ఆర్జేడీ 2020 ఎన్నికల్లో 75 సీట్లు గెలిచి సత్తా చాటుకుంది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమిని చవిచూసినా 23 శాతం ఓటింగ్ షేర్‌తో అన్ని పార్టీల కంటే ముందుంది. ఓట్ షేర్‌లో అందరికంటే ముందున్నా అత్యధిక సీట్లు మాత్రం బీజేపీ, జేడీయూ ఎగరేసుకుపోయాయి.
ఇవి కూడా చదవండి..
రాజకీయాలకు గుడ్‌బై.. లాలూ కుమార్తె సంచలన ప్రకటన
కేంద్ర మాజీ మంత్రిని సస్పెండ్ చేసిన బీజేపీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.