Nimisha Priya: నిమిష ప్రియను క్షమించం.. బ్లడ్‌మనీ కాదు.. న్యాయమే కావాలి!
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:31 PM
కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం మరణశిక్ష అమలు వాయిదా పడిన మరుసటి రోజే మృతుడి సోదరుడు బాంబు పేల్చాడు. మేము నిమిషను క్షమించం. మాకు బ్లడ్ మనీ వద్దు. న్యాయమే కావాలని స్పష్టం చేశారు.

Victim Family Denies Blood Money: యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాధిత కుటుంబాన్ని బ్లడ్ మనీకి ఒప్పించేందుకు సమయం చిక్కిందని అంతా భావించారు. కానీ, అంతలోనే మృతుడి సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ బాంబు పేల్చాడు. నేరానికి క్షమాపణ అంటూ ఉండదని.. చేసిన తప్పుకు నిమిషకు శిక్ష పడాల్సిందేనని ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చేశారు.
బుధవారం శిక్ష అమలు తాత్కాలికంగా నిలిపేసిన అనంతరం మృతుడి సోదరుడు ఫేస్ బుక్‌లో ఇలా పోస్ట్ చేశాడు. 'ఈ వాయిదాను మేం ఊహించలేదు. మా కుటుంబం రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రతిపాదనలు అన్నింటినీ తిరస్కరించింది. ఈ ప్రయత్నాలు మాకు కొత్తేమీ కావు. ఎన్ని విధాలా ఒత్తిడి చేసినా మేం మా అభిప్రాయాన్ని మార్చుకోం. బ్లడ్ మనీకి అంగీకరించే ప్రసక్తే లేదు. నా సోదరుడిని హత్య చేసిన ఆమెకు ఉరిశిక్ష పడితీరాల్సిందే. క్షమాపణ అనే మాటే లేదు. మాకు కావాల్సింది డబ్బు కాదు. న్యాయం' అని స్పష్టం చేశారు. భారతీయ మీడియా దోషిగా నిరూపితమైన నిమిషను బాధితురాలిగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు.
యెమెన్ ప్రభుత్వం నిమిష ప్రియ మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేయడంపై మృతుడు తలాల్ అదిబ్ మెహది కుటుంబం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. డబ్బుతో పోయిన ప్రాణానికి వెలకట్టలేరని.. మాకు న్యాయం కావాలని పట్టుబడుతోంది.
యెమెన్ చట్టం ప్రకారం, మరణించిన వ్యక్తి కుటుంబం నిందితులను క్షమించి పరిహారానికి అంగీకరిస్తే శిక్షను రద్దు చేయవచ్చు. అందుకే ఈ విషయమై చాలా కాలం నుంచి భారత ప్రభుత్వం యెమెన్ స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్‌తో నిరంతర చర్చలు జరుపుతోంది. మరో పక్క మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ మృతుడి కుటుంబంతో క్షమాధనానికి ఒప్పుకునేందుకు తీవ్ర చర్చలు జరిపారు. నిమిష కుటుంబం బాధిత కుటుంబానికి ఒక మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.6కోట్ల) క్షమాధనం ఇచ్చేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
బోయింగ్ విమానాల్లో ఇంధన మీటపై ముందే హెచ్చరించిన యూకే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి