Rail Fares Hike: రైలు ప్రయాణీకులకు షాక్.. జూలై 1 నుంచి పెరగనున్న టికెట్ ఛార్జీలు..! ఎంతంటే..?
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:04 PM
Railways Fares Hike July1 2025: ప్రయాణీకులకు రైల్వేశాఖ షాకిచ్చింది. అనేక సంవత్సరాల తర్వాత టికెట్ ఛార్జీలను పెంచనుంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ.. జూలై 1 నుంచి టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలుస్తోంది. రైల్వే ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ తప్పనిసరి చేసినట్లు సమాచారం.

Indian Railways New Ticket Rates 2025: భారతీయ రైల్వేశాఖ ప్రయాణీకులకు బిగ్ షాక్ ఇచ్చింది. టికెట్ ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినప్పటికీ రైల్వే ఉన్నతాధికారి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అనధికార సమాచారం ప్రకారం, చాలా సంవత్సరాల తర్వాత రైల్వే శాఖ ప్యాసింజర్ రైలు ఛార్జీలను పెంచబోతోంది. నాన్ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు కిలోమీటరుకు ఒక పైసా, ఏసీ ప్రయాణీకులకు 2 పైసల చొప్పున పెరుగుతాయి. అయితే, సెకండ్ క్లాస్ సాధారణ తరగతిలో500 కి.మీ దూరం వరకూ ప్రయాణించేవారికి ఈ పెంపు వర్తించదు. వీరు గనక అదనంగా ఒక్క కిలోమీటరు దూరంగా ప్రయాణించినా అరపైసా చొప్పున పెరుగుతుంది. అలాగే నెలవారీ సీజన్ టికెట్ ధరలు, సబర్బన్ రైళ్ల టికెట్‌ఛార్జీల్లో కూడా ఎలాంటి మార్పు ఉండబోదు.
తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్‌లో కీలక మార్పు
జూలై 1 నుంచి రైల్వే శాఖ తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించిన కీలక నియమం అమల్లోకి తీసుకురానుంది. కొత్త నియమం ప్రకారం, డిజిటల్ నవీకరణతో పాటు, ఆధార్ కార్డు ఉన్నవారు మాత్రమే IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. సరైన వ్యక్తులు మాత్రమే తత్కాల్ బుకింగ్ ప్రయోజనాలు పొందేలా చూడటమే ఈ మార్పు వెనకగల ప్రధాన ఉద్దేశమని ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దీనితో పాటు, భారతీయ రైల్వేలు అధీకృత బుకింగ్ ఏజెంట్లపై కూడా అనేక ఆంక్షలు విధించాయి. వాటిలో ఒకటి ఏజెంట్లు ఇకపై బుకింగ్ విండో ప్రారంభమైన మొదటి 30 నిమిషాలలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోలేరు. AC క్లాస్ టిక్కెట్ కోసం ప్రయాణీకులు ఉదయం 10:00 నుంచి 10:30 వరకూ.. నాన్-ఏసీ టిక్కెట్ల కోసం ఉదయం 11:00 నుండి 11:30 వరకూ నిరంతరాయంగా సంబంధిత వెబ్‌సైట్లలో బుక్ చేసుకోవచ్చు.
OTP ప్రామాణీకరణ
జూలై 1, 2025 నుంచి ఆధార్ ధృవీకరించబడిన వినియోగదారులు మాత్రమే IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకోగలరు. జూలై 15 నుంచి బుకింగ్ కోసం ఆధార్ ఆధారిత OTP ప్రామాణీకరణ తప్పనిసరి కానుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో అక్రమాలను అరికట్టడానికి, తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి OTP ప్రామాణీకరణ తప్పనిసరి చేసింది రైల్వేశాఖ. ఆధార్ ధృవీకరణ తర్వాత కౌంటర్ ఆధారిత తత్కాల్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గదిలోకి కత్తితో వెళ్లిన నవ వధువు.. కంగుతిన్న వరుడు
పెళ్లికి ఒప్పుకోలేదని.. ఐదో అంతస్తు నుంచి తోసేశాడు..
For National News And Telugu News