Murder Of Democracy: ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ABN , Publish Date - Jun 25 , 2025 | 04:32 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది.

న్యూఢిల్లీ జూన్ 25: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ (బుధవారం) కేంద్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. 1975 నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రివర్గం ఓ తీర్మానం చేసింది. 1975లో అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. మరోవైపు ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పౌర స్వేచ్ఛలను అణచివేయడం, మీడియాపై సెన్సార్‌షిప్‌ను ప్రధాని మోదీ ఖండించారు. 'తాజాగా రిలీజైన ది ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకం దేశంలో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితులలో నా ప్రయాణాన్ని వివరిస్తుంది. ఈ పుస్తకం ఆ కాలంలోని అనేక జ్ఞాపకాలను తిరిగి తెచ్చిందని' మోదీ పోస్ట్ చేశారు.
ఇంకా ప్రధాని తన సందేశంలో ఏమన్నారంటే 'ఎమర్జెన్సీ చీకటి రోజులను గుర్తుంచుకునే వారందరూ లేదా ఆ సమయంలో బాధపడ్డ కుటుంబాల్లో ఉన్నవారంతా సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకోవాలని నేను కోరుతున్నా. ఇది 1975 నుంచి 1977 వరకూ నెలకొన్న జరిగిన దారుణాలపై యువతలో అవగాహన పెంచుతుంది' అని ప్రధాని మోదీ చెప్పారు.
ఇక, ఇదే అంశంపై ఢిల్లీ క్యాబినెట్ మంత్రి పర్వేశ్ వర్మ స్పందిస్తూ.. 'కౌన్సిల్ సమావేశంలో మేము అత్యవసర పరిస్థితిని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించాం. అదే సమయంలో అత్యవసర పరిస్థితిలో అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (MISA) కింద నిర్బంధించబడిన వారితో మా NDMC(New Delhi Municipal Council) ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తద్వారా మన ప్రజాస్వామ్యంలో పోరాట యోధులైన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుంది' అని పర్వేశ్ వర్మ అన్నారు.
'మన రాజ్యాంగాన్ని బలహీనపరిచి దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం ఒక చీకటి అధ్యాయం. దీన్ని మనం ఎప్పటికీ మరచిపోలేం. అప్పటి అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన వ్యక్తులను జైళ్లో పెట్టిన అదే పార్టీ.. ఇప్పుడు రాజ్యాంగం పరిరక్షణ అంటూ పెడబొబ్బలు పెడుతూ నాటకాలాడుతోంది. ఇది చాలా సిగ్గుచేటు' అని పర్వేశ్ వర్మ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి