Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన.. పార్లమెంటుకు మెమొరాండం
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:27 PM
నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా, వద్దా? అనే దానిపై స్పీకర్/సభ చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

న్యూఢిల్లీ: ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma)పై చర్యలకు పార్లమెంటు సిద్ధమైంది. జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ ఎంపీలు ఉభయసభల్లో సోమవారం నాడు మెమొరాండం సమర్పించారు. లోక్‌సభలో అభిశంసన తీర్మానంపై 145 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యాంగంలోని 124, 217, 218 నిబంధనల కింద ఈ నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, జనసేన పార్టీ, ఏజీపీ, శివసేన (షిండే వర్గం), ఎల్‌జేఎస్‌పీ, ఎస్‌కేపీ, సీపీఐ సహా పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ తీర్మానానికి మద్దతిచ్చారు. సంతకాలు చేసిన ప్రముఖుల్లో అనురాగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్, లోక్‌సభలో విపక్ష నేత రాహల్ గాంధీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీపీ చౌదరి, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఎంపీలు ఈ మెమొరాండం సమర్పించారు.
ఇటు, రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన ఎంపీలతో సహా 63మంది ఎంపీలు జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ మెమొరాండంపై సంతకాలు చేశారు. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు ఈ మెమొరాండం సమర్పించారు.
నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా, వద్దా? అనే దానిపై స్పీకర్/సభ చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వర్మ ఉన్న సమయంలో ఆయన ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. ఈ ఘటన సంచలనం కావడంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేశారు. నోట్ల కట్టలు దొరికింది నిజమేనని కమిటీ తేల్చింది. దీంతో ఆయనను రాజీనామా చేయాలని సీజేఐ సూచించారు. అయితే ఈ సూచనను జస్టిస్ వర్మ తిరస్కరించారు. దీంతో జస్టిస్ వర్మ అభిశంసనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి