Supreme Court: రాజకీయ పోరాటాలతో మీకేం పని.. ఈడీకి సుప్రీంకోర్టు హెచ్చరిక
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:28 PM
ట్రయిల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్ధించారని, అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో తీర్పులు వచ్చాయని, వాటిని ఈడీ తిరగరాసే ప్రయత్నం చేయడం అనవసరమని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: వివాదాస్పద మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (MUDA) కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి ఈడీ జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు సమర్ధించింది. హైకోర్టు నిర్ణాయాన్ని సవాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని హెచ్చరించింది.
ఈడీ రాజకీయ పాత్రపై ఆగ్రహం
ట్రయిల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్ధించారని, అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో తీర్పులు వచ్చాయని, వాటిని ఈడీ తిరగరాసే ప్రయత్నం చేయడం అనవసరమని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ పోరాటాలతో మీకేం పని అని ఈడీని నిలదీసింది. 'రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగనీయండి. మీకేం పని?' అని అని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో తమ పిటిషన్‌ను వెనక్కి తీసుంటామని ఈడీ తరఫు హాజరైన సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు ధర్మాసనానికి తెలిపారు. దీంతో పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు సీజేఐ ప్రకటించారు.
ముడా కేసు
కర్ణాటకలోని 14 ప్లాట్లను ముడా కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్నది ఈడీ ఆరోపణగా ఉంది. మనీలాండరింగ్ విచారణలో భాగంగా పార్వతి సిద్ధరామయ్య, రాష్ట్ర మంత్రి బి.సురేష్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. భూముల లావాదేవీల ద్వారా అధికార దుర్వినియోగం, అక్రమ ప్రయోజనాలు పొందారని ఈడీ అనుమానిస్తోంది. అయితే ఈడీ సమన్లను 2025 మార్చిలో కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. పీఎంఎల్ఏ కింద ప్రొసీడింగ్‌కు అవసరమైన సాక్ష్యాలు, లీగల్ గ్రౌండ్స్ లేవని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
రాజకీయ ప్రయోజనాల్లేవు, భూములు సరెండర్ చేశాం..
హైకోర్టు ముందు విచారణలో పార్వతి సిద్ధరామయ్య తమ వాదనను వినిపించారు. స్వచ్ఛందంగా 14 భూములను తాను వదులుకున్నానని, తాను ఎలాంటి నేరపూరిత ప్రయోజనాలు పొందలేదని చెప్పారు. ఆమె లీగల్ టీమ్ సైతం ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఈడీ సమన్లు నిరాధారమని కోర్టుకు విన్నవించింది. ఈ అభిప్రాయాలతో హైకోర్టు ఏకీభవించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సైతం సమర్ధించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పిదం కనిపించడం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను సీజేఐ కొట్టివేశారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
రన్‌వే దాటిన ఎయిర్ ఇండియా విమానం.. ఏం జరిగిందంటే?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి