Heavy Rains: గుబులు పుట్టిస్తున్న ‘మొంథా’.. చెన్నై సహా 8 జిల్లాలకు భారీ వర్షసూచన
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:39 AM
ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న ‘మొంథా’ తుఫాన్.. తమిళనాడులో గుబులు పుట్టిస్తోంది. దీని తీవ్రత భారీగా వుం టుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో. ఎటు నుంచి ఎటు వెళ్తుందోనని రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా వుండగా తుఫాను కారణంగా భారీ వర్షం పడే అవకాశముండడంతో మంగళవారం తిరువళ్లూర్ జిల్లాకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు.
- నేడు తిరువళ్లూర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
- తొమ్మిది హార్బర్లలో 2వ నెంబరు తుఫాన్ హెచ్చరిక
- ‘ఈశాన్యం’తో 57 శాతం అదనపు వర్షపాతం నమోదు
- నేడు నాలుగు జిల్లాల్లో విద్యాలయాలకు సెలవు
చెన్నై: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)ను వణికిస్తున్న ‘మొంథా’ తుఫాన్.. తమిళనాడు(Tamil Nadu)లో గుబులు పుట్టిస్తోంది. దీని తీవ్రత భారీగా వుం టుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో. ఎటు నుంచి ఎటు వెళ్తుందోనని రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా వుండగా తుఫాను కారణంగా భారీ వర్షం పడే అవకాశముండడంతో మంగళవారం తిరువళ్లూర్ జిల్లాకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. కాగా చెన్నై సహా 8 జిలాల్లో భారీవర్షం పడే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డీడీజీఎం డాక్టర్ పి.అముద తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మొంథా తుఫాను కారణంగా తిరువళ్లూర్ జిల్లాల్లో మంగళవారం అతి భారీవర్షాలు, చెన్నై, రాణిపేట, కాంచీపురం, చెంగల్పట్టు, తేని, తెన్కాశి, తిరు నల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 1వ తేది నుంచి సోమవారం వరకు 57 శాతం అదనపు వర్షపాతం నమోదైందని, 18 జిల్లాల్లో సాధారణం కన్నా అదనపు వర్షపాతం నమోదైందని వివరించారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 144 మి.మీ కాగా, ప్రస్తుతం 227 మి.మీ వర్షపాతం నమో దైందని డైరెక్టర్ అముద తెలిపారు.

ఆరు రోజుల్లో 4.9 లక్షల మందికి ఆహారం...
జీసీసీ పరిధిలో ఈ నెల 22 నుంచి 27వ తేది వరకు 4,09,650 మందికి ఆహారం అందజేసినట్టు జీసీసీ ప్రకటన విడుదల చేసింది. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో 2వేల మోటారు పంపులు ఏర్పాటుచేసి, ఎప్పటి కప్పుడు నీరు తొలగించేలా ఏర్పాటుచేశామన్నారు. అలాగే, చెట్లు కూలితే వాటిని తొలగించేందుకు 457 యంత్రాలు సిద్ధం చేశామన్నారు. నగరంలోని 22 సబ్‌వేల్లో వర్షపు నీరు చేరకుండా 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో నెలకొన్న వరద సమస్యలపై ‘1913’ నెంబరుకు ఫిర్యాదు చేయాలని జీసీసీ తెలియజేసింది.
తొమ్మిది హార్బర్లలో తుపాను హెచ్చరికలు
‘మొంథా’ తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని 9 హార్బర్లలో సోమవారం 2వ నెంబరు ప్రమాద హెచ్చ రిక జారీచేశారు. రెండు రోజుల క్రితం ఏర్పడి న అల్ప పీడనం బలపడి వాయుగుండంగా మారిన నేపథ్యంలో, ఆదివారం హార్బర్లలో 1వ ప్రమాద హెచ్చరిక జారీచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, వాయుగుండం తుఫాన్‌గా మారడంతో, చెన్నై, కడలూరు, ఎన్నూర్, కాట్టుపల్లి, పుదుచ్చేరి, కారైక్కాల్, నాగపట్టణం, పాంబన్, తూత్తుకుడి తదితర హార్బర్లలో 2వ తుఫాను ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.

తీరానికే పరిమితమైన పడవలు...
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో చెన్నై, రామనాథపురం సహా పలు జిల్లాల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ కారణంగా సముద్రంలో వాతావరణం అల్లకల్లోలంగా ఉంటూ 50 నుంచి 70 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదముందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన క్రమంలో జాలర్లు సోమవారం కూడా చేపల వేటకు వెళ్లకపోవడంతో పడవలు తీర ప్రాంతాలకే పరిమితమయ్యాయి.
నేడు సెలవు
భారీ వర్షాల కారణంగా చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కడలూరు జిల్లాల్లో విద్యాలయాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు మంగళవారం సెలవు ప్రకటించారు.
చెన్నైలో భారీవర్షం...
నగర వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచే భారీవర్షం కురిసింది. ఎగ్మూర్, చెట్పెట్, కీల్పాక్కం, నుంగంబాక్కం, వెస్ట్ మాంబళం, టి. నగర్, గిండి, కోడంబాక్కం, వడపళని, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కోడంబాక్కం వెళ్లాలర్ వీధి, వడపళని పెరియార్ రోడ్డు, కుమరన్ కాలనీ మెయిన్ రోడ్డు, కేకే నగర్ పీటీ రాజన్ రోడ్డు, సత్య గార్డన్ తదితర ప్రాంతాల్లో నీరు చేరడంతో వాహన చోదకులు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. అలాగే, జీఎస్టీ రోడ్డు ఆలందూర్ కోర్టు నుంచి శాంతి పెట్రోల్ బంక్ వరకు గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహరాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదంబాక్కం ప్రాంతంలోని సెయింట్ థామస్ మౌంట్ సబ్ వే సమీపంలోని డ్రైనేజీలో లీకేజీ ఏర్పడి వర్షపు నీటిలో మురుగునీరు కలసి సబ్వేలో ప్రవహించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ
Read Latest Telangana News and National News