Narendra Modi: అంతమొందించేందుకు ఎంతవరకైనా
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:55 AM
పహల్గాంలో అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదుల అంతం చూస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఉగ్రవాదులు, వారిని మద్దతు ఇచ్చే వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ ఉగ్రదాడిని భారత ఆత్మపై దాడిగా అభివర్ణించారు

ఆ ఉగ్రవాదులు భూమ్మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం
‘పహల్గాం’ హంతకులను, వారికి మద్దతిస్తున్న వారిని కలలో కూడా ఊహించనట్లు శిక్షిస్తాం
ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు.. భారత ఆత్మపై దాడికి శత్రువుల దుస్సాహసం
ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేసమయం ఆసన్నమైంది: ప్రధాని మోదీ
మద్దతు ప్రకటించిన దేశాలకు కృతజ్ఞతలు
పట్నా, ఏప్రిల్ 24: పహల్గాంలో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల అంతు చూస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ హంతకులు భూమ్మీద ఎక్కడ దాక్కొన్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు. ఉగ్రవాదులకు, ఉగ్రమూకలకు మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం బిహార్‌లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాంలో ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ముష్కరులకు తీవ్రమైన హెచ్చరిక చేశారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తన ప్రసంగం ఆరంభంలో ‘పహల్గాం ఉగ్రదాడిలో అసువులుబాసిన మన కుటుంబ సభ్యుల గౌరవార్థం మనమంతా మౌనం పాటిద్దాం’ అని మోదీ సభికులను కోరారు. ప్రధానితో పాటు సభకు హాజరైన వారంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి, మృతులకు అంజలి ఘటించారు.
అనంతరం దాడి గురించి ప్రధాని స్పందించారు. పాకిస్థాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ‘‘పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, ఈ కుట్రకు సహకరించిన వారిని.. వారు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తాం’’ అని మోదీ స్పష్టం చేశారు. సాధారణంగా హిందీ, ప్రాంతీయ భాషల్లో ప్రసంగాన్ని ఆరంభించే ప్రధాని.. గురువారం హఠాత్తుగా కొద్దిసేపు ఆంగ్లంలో మాట్లాడారు. ‘‘మిత్రులారా.. బిహార్ గడ్డపై నుంచి యావత్ ప్రపంచానికి నేను ఒక్కటే చెబుతున్నా. అమాయకుల ప్రాణాలు తీసిని ప్రతి ఉగ్రవాదినీ భారత్ వెతికి పట్టుకుంటుంది. వారి వెనక ఉన్నవారినీ వదిలిపెట్టబోం. అందరినీ కఠినంగా శిక్షిస్తాం. వారి అంతు చూసేందుకు ఎంతవరకైనా వెళ్తాం. భారతదేశ స్ఫూర్తిని ఉగ్రవాదం ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదు. ఉగ్రవాదాన్ని క్షమించే ప్రసక్తే లేదు’’ అని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై పోరులో భారత్ వెనక్కి తగ్గదన్న సందేశాన్ని, ముష్కరులకు హెచ్చరికనూ మోదీ ప్రపంచానికి తెలియజేసేందుకే ఆంగ్లంలో మాట్లాడారు. అనంతరం ఆయన హిందీలో ప్రసంగించారు. ‘‘బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం. యావత్ దేశం దీనికి కట్టుబడి ఉంటుంది. మానత్వంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ మనతోనే ఉన్నారు. ఈ కష్ట సమయంలో అనేక దేశాల ప్రజలు, నేతలు మనకు మద్దతుగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు’’ అని ప్రధాని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం ఉగ్రవాదం వెన్ను విరిస్తుందన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న దారుణ ఘటనను దేశమంతా ఖండిస్తోందని, బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తోందని చెప్పారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని, ఓ మహిళ సోదరుడిని, మరో మహిళ జీవిత భాగస్వామిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయి. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదు. భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన దుస్సాహసం’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైందని మోదీ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్