Share News

CM Mamata Banerjee: రేపే ఎన్నికలు పెట్టండి.. మోదీకి దీదీ సవాల్!

ABN , Publish Date - May 29 , 2025 | 05:38 PM

బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సర్కార్ హింస, అవినీతితో నిండిపోయిందని.. తృణమూల్ చెర నుంచి బెంగాల్‌ను విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

CM Mamata Banerjee: రేపే ఎన్నికలు పెట్టండి.. మోదీకి దీదీ సవాల్!
CM Mamata Banerjee

కోల్‌కతా: బెంగాల్‌లో అవినీతి, హింస పెరిగిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ రాష్ట్రాన్ని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇక్కడి ప్రజలు మార్పు కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. అలిపుర్‌దువార్‌లో జరిగిన ర్యాలీలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. అఖిలపక్ష ఎంపీల బృందం విదేశాల్లో పర్యటిస్తున్న ఈ తరుణంలో మోదీ నుంచి ఇలాంటి కామెంట్స్‌ను తాను అస్సలు ఊహించలేదన్నారు. ఉగ్రవాదంపై పోరులో మనమంతా ఐక్యంగా ఉన్నామని, టెర్రరిజాన్ని సహించబోమని చెప్పేందుకు ఎంపీలు పర్యటిస్తున్నారని.. ఈ సమయంలో మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇదే సమయంలో ప్రధానికి ఆమె ఓ సవాల్ విసిరారు. ఆ చాలెంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..


గెలుపు మాదే..

బెంగాల్‌లో రేపే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు మమతా బెనర్జీ. రాష్ట్ర ప్రజలంతా తమ వైపే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. తృణమూల్‌కు డోకా లేదని.. తక్షణం ఎన్నికలు నిర్వహించినా తమదే విజయమని దీదీ స్పష్టం చేశారు. కాగా, అలిపుర్‌దువార్‌లో జరిగిన సభలో మమతా సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు మోదీ. బెంగాల్ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని.. ముర్షిదాబాద్, మాల్దా అల్లర్లే దీనికి ఉదాహరణ అని అన్నారు. గూండాలకు స్వేచ్ఛ ఇచ్చి ప్రజలపై ఉసిగొల్పారని ప్రధాని ఆరోపించారు. ఇలాగేనా ప్రభుత్వం నడిపేదని దుయ్యబట్టారు. ప్రతి అంశంలో కోర్టులు కలుగజేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తృణమూల్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదని.. ఈ సర్కారు మాకు వద్దని అంటున్నారని పేర్కొన్నారు మోదీ. ఈ వ్యాఖ్యలపై దీదీ పైవిధంగా స్పందించారు. వెంటనే ఎన్నికలు పెట్టాలని ప్రధానికి సవాల్ విసిరారు.


ఇవీ చదవండి:

యూనీఫామ్ లేని యుద్ధ వీరుడు

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 06:13 PM