Kolkata Law College Incident: కోల్‌కతా లా కాలేజీ ఘటనపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
ABN , Publish Date - Jun 28 , 2025 | 06:44 PM
సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై బాధితురాలికి ఈనెల 26న కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలిపై ఒంటిపై గాయాలున్నట్టు అధికారులు ధ్రువీకరించారు.

కోల్‌కతా: సంచలనం రేపుతున్న దక్షిణ కోల్‌కతాలోని కస్బా 'లా' కాలేజీ విద్యార్థిని సామూహిక అత్యాచార ఘటనపై ఓవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుండగా, సమగ్ర దర్యాప్తునకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారులు శనివారంనాడు తెలిపారు. అసిస్టెంట్ ర్యాంక్ అధికారి ఈ టీమ్‌కు సారథ్యం వహించనున్నారు.
అత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20), కాలేజీ స్టాఫర్ మనోజిత్ మిశ్రా (31)లను గత గురువారంనాడు అరెస్టు చేశారు. విద్యార్థినిపై లైంగిక దాడి సమయంలో పరిసరాల్లోనే ఉన్నప్పటికీ తన బాధ్యతలను నిర్వహించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించాడనే కారణంగా కాలేజీ సెక్యూరిటీ గార్డును శనివారనాడు అరెస్టు చేశారు. దీంతో ఇంతవరకూ ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. గత బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 గంటల మధ్యలో విద్యార్థినిపై అత్యాచార ఘటన జరిగిందని, త్వరలో జరగున్న పరీక్షల కోసం అప్లికేషన్ పూర్తి చేయడానికి ఆమె కాలేజీకి వెళ్లినప్పుడు ఇది చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.
వైద్య పరీక్షల్లో..
కాగా, సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై బాధితురాలికి ఈనెల 26న కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలిపై ఒంటిపై గాయాలున్నట్టు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. మెడమీద గుర్తులు, శరీరంపై చేతిగోళ్ల గాట్లు ఉన్నాయని, దాడి జరిగిందనడాన్ని ఇవి నిర్ధారిస్తున్నాయని చెబుతున్నారు. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ సైతం నిర్వహించారని తెలుస్తోంది. బాధితురాలు సైతం తనను విడిచిపెట్టాలని పాదాలు పట్టుకుని పదేపదే ప్రాధేయపడినా తనను ప్రధాన నిందితుడు విడిచిపెట్టలేదని తన ఫిర్యాదులో పేర్కొంది. పైగా తనను గార్డు రూమ్‌లోకి తీసుకువెళ్లమని సహచరులిద్దరినీ ఆదేశించాడని, గార్డును బయట కూర్చోబెట్టారని ఆమె తెలిపింది.
రాజకీయ వివాదం
కాగా, లా విద్యార్థినిపై అత్యాచార ఘటన రాజకీయ వివాదానికి తెరలేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా గతంలో కాలేజీ టీఎంసీపీ యూనిట్‌లో పనిచేశాడని, ఆ కారణంగానే అతనిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం టీఎంసీ చేస్తోందని బీజేపీ ఆరోపించింది. టీఎంసీ లోక్‌సభ ఎంపీ అబిషేక్ బెనర్జీ సహా పలువురు సీనియర్ నేతలతో మిశ్రా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే మిశ్రా గతంలో తమ పార్టీ స్టూడెంట్ వింగ్‌లో పనిచేసినట్టు టీఎంసీ అంగీకరించినప్పుటికీ, ఆరోపణల నేపథ్యంలో అతన్ని దూరంగా పెట్టేసినట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
కోల్‌కతా లా కాలేజీ అత్యాచార ఘటన.. సెక్యూరిటీ గార్డు అరెస్టు
ఐఎస్ఐఎస్ ఇండియా మాజీ చీఫ్ ఆసుపత్రిలో కన్నుమూత
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి