Mallikarjun Kharge: రాష్ట్రపతుల పేర్లు తప్పుగా పలికిన ఖర్గే.. క్షమాపణకు బీజేపీ డిమాండ్
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:51 PM
ఛత్తీస్‌గఢ్‌లో పెద్ద సంఖ్యలో చెట్లను కూల్చివేయడంపై మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తన ఇండస్ట్రియల్ మిత్రులతో కలిసి గిరిజనుల భూములు లాక్కుంటోందని, సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.

రాయ్‌పూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దూమారం రేపాయి. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పబ్లిక్ ర్యాలీలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్చరించడం వివాదానికి కారణమైంది. దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ.. ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
రాయ్‌పూర్‌లోని సైన్స్ గ్రౌండ్‌లో మంగళవారంనాడు జరిగిన పార్టీ కార్యక్రమంలో ఖర్గే పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరును 'ముర్మ జీ' అంటూ సంబోధించారు. అయితే వెంటనే దానిని సవరించుకుని 'ముర్ము' అని పలికారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆయన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను 'కోవిడ్'గా సంబోధించడం మరోసారి విమర్శలకు దారితీసింది.
ఛత్తీస్‌గఢ్‌లో పెద్ద సంఖ్యలో చెట్లను కూల్చివేయడంపై ఖర్గే తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తన ఇండస్ట్రియల్ మిత్రులతో కలిసి గిరిజనుల భూములు లాక్కుంటోందని, సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. జల్, జంగిల్, జమీన్‌ను పరిరక్షించుకునేందుకు మనమంతా ఐక్యంగా నిలబడాల్సిన అవసరముందని చెప్పారు. 'వాళ్లు (బీజేపీ) ముర్మ (ద్రౌపది ముర్ము)ను రాష్ట్రపతిగా, (రామ్‌నాథ్) కోవిడ్ (కోవింద్)ను రాష్ట్రపతిగా చేసామని చెప్పుకుంటారు. కానీ ఎందుకు? మన అడవులు, నీళ్లు, భూములను దొంగిలించేందుకు. ఇవాళ వాటిని అదానీ, అంబానీ వంటి వాళ్లు ఆక్రమించుకుంటున్నారు' అని ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు.
బహిరంగ క్షమాపణకు బీజేపీ డిమాండ్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌పై ఖర్గే అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ద్వారా వారిని అవమానించారని బీజేపీ మండిపడింది. తక్షణం ఖర్గే, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీనిపై బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ద్వారా దళిత, ఆదివాసీ, రాజ్యాంగ వ్యతిరేక భావజాలాన్ని కాంగ్రెస్ చాటుకుందని విమర్శించారు. రామ్‌నాథ్ కోవింద్‌ను కోవిడ్ అని, ద్రౌపది ముర్మును ముర్మాజీ అని, ల్యాండ్ మాఫియా అని, ఆస్తులు, అడవులు లాక్కొనేందుకు ఆమె రాష్ట్రపతి అయ్యారనే విధంగా ఖర్గే ఆరోపణలు చేశారని తప్పుపట్టారు. కాంగ్రెస్, ఖర్గే తక్షణం క్షమాపణ చెప్పాలని, లేకుంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని అన్నారు. ఖర్గే కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ జాతీయ అధ్యక్షుడని, పార్టీ నేత రాహుల్ గాంధీ తరఫున ఖర్గే ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని భాటియా విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
పాక్‌కు చైనా సాయం.. కథ మొత్తం బయటపెట్టిన భారత్!
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి