Pahalgam Attack: కళ్ల ముందే నా తండ్రిని కాల్చి చంపేశారు.. బాధితురాలి ఆవేదన వర్ణణాతీతం..
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:51 PM
పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. అశ్రునయనాలతో వీడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఆరతి.. ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకుని కన్నీటిపర్యంమతమైంది..

పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. అశ్రునయనాలతో వీడ్కోలు పలుకుతున్నారు. మరోవైపు దాడి సమయంలో తాము పడ్డ నరకయాతను తలుచుకుని కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఆరతి.. ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకుని కన్నీటిపర్యంమతమైంది. నా తండ్రిని నా కళ్ల ముందే కాల్చి చంపారని బోరున విలపించింది.
మినీ స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన జమ్మూకాశ్మీర్ (Jammu and Kashmir) అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం (Pahalgam Terror Attack) యాత్ర.. పర్యాటకుల జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని దేశం జీర్ణించుకోలేకపోతోంది. ఈ దాడిలో చిన్నారులు, మహిళలను వదిలిపెట్టిన ముష్కరులు.. మగవారినే లక్షంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. ఈ దాడి నుంచి బయటపడిన వారు ఇప్పటికీ భయంతో వణికిపోతూనే ఉన్నారు. ఉగ్రదాడి సమయంలో తాము పడిన నరకయాతను తలుచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. కళ్లెదుటే తమ భర్తలు, బంధువులు, స్నేహితులను పోగొట్టుకున్న వారి బాధ వర్ణణాతీతంగా ఉంది. ఆ సమయంలో కేరళకు చెందిన ఎన్ రామచంద్రం ఉగ్రదాడుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. తన తండ్రిని తన కళ్ల ముందే కాల్చి చంపారంటూ ఆమె కూతురు ఆరతి బోరున విలపించింది.
ఉగ్రదాడి సమయంలో ఏం జరిగిందో ఆరతి వివరించింది.. అది ఆమె మాటల్లోనే.. ‘‘ రెండో రోజు పర్యటనలో భాగంగా పహల్గాంకు చేరుకున్నాం. మేమంతా గుర్రాల మీద అక్కడికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నాం. ఆ సమయంలో ఉగ్రవాదులు అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతున్నారు. ఆ సయయంలో కొచ్చికి చెందిన ఓ వ్యక్తి ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడానికి మరో ప్రదేశం కోసం వెతుకుతున్నాడు. అయితే మా తండ్రి రామచంద్రం అక్కడే ఉండమని చెప్పడంతో దాక్కున్నాం. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి ‘కలిమా’ అని అన్నాడు. అతను ఏం చెబుతున్నాడో మాకు అర్థం కాలేదు. ఆ మాట అన్న వెంటనే నా తండ్రిని నా కళ్ల ముందే కాల్చి చంపేశాడు’’.. అంటూ ఆరతి ఆ రోజు జరిగిన విషాద క్షణాలను గుర్తు చేసుకున్నారు.
నిర్జీవంగా పడి ఉన్న తండ్రిని కౌగిలించుకుని ఏడుస్తున్న సమయంలో తనపై ఉగ్రవాది తుపాకీ గురిపెట్టాడని ఆరతి తెలిపింది. అయితే ఆ క్షణంలో ఆమె కుమారులు కేకలు వేయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడని చెప్పింది. తర్వాత పిల్లలతో సహా తాను అడవి గుండా ఓ రిసార్ట్‌కు చేరుకున్నానని తెలిపింది. అక్కడ భారత సైన్యం వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లిందని చెప్పింది. అయితే ఆ సమయంలో ముసాఫిర్, సమీర్ అనే ఇద్దరు కాశ్మీరీ టాక్సీ డ్రైవర్లు తమకు సాయం చేశారని ఆరతి తెలిపింది. కాగా, రామచంద్రం అంత్యక్రియలు శుక్రవారం కొచ్చిలో ప్రభుత్వ లాంఛనల మధ్య జరిగాయి.
పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు భరోసా
పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) సంఘీభావం తెలిపింది. ఉగ్రవాదుల హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.1 కోటి (ప్రతి కుటుంబానికి రూ. 4 లక్షలు) అందజేస్తామని NSE ప్రకటించింది. ఎన్‌ఎస్‌సీ ఎండీ, సీఈఓ అశిష్‌కుమార్ చౌహాన్ మాట్లాడుతూ.. “ఇది మన దేశానికి శోక సమయం. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. వీలైనంత సహాయం అందించాలని ఆశిస్తున్నాం” అని అన్నారు.