Thug Life Movie: ఓవైపు వివాదం.. మరోవైపు సర్కార్ అండ.. కమల్‌కు గుడ్‌న్యూస్
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:52 PM
Thug Life Movie: వివాదాల్లో చిక్కుకున్న నటుడు కమల్ హాసన్‌కు తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ 5న తమిళనాడు వ్యాప్తంగా థగ్ లైఫ్ సినిమా విడుదల కానుంది.

చెన్నై, జూన్ 4: తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన థగ్ లైఫ్ సినిమా (Thug life Movie) చుట్టూ వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమల్ హాసన్‌కు తమిళనాడు ప్రభుత్వం (Tamilnadu Govt) మద్దతుగా నిలిచింది. సినిమా విడుదల రోజున అంటే జూన్ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ప్రత్యేక ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు తమిళనాడు సర్కార్ సినిమా నియంత్రణ నిబంధనలు, 1957 ప్రకారం జీవో నెంబర్ 387ను ప్రభుత్వం జారీ చేసింది. ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ తరపున ముఖ్య కార్యనిర్వాహక అధికారి వీ.నారాయణ మే 30న ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై చెన్నై రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి జూన్ 2న ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. ప్రత్యేక షోల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగకుండా, పోలీసుల బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, థియేటర్ల శుభ్రత, భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది.
కాగా.. థగ్ లైఫ్‌కు సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలోని కన్నడ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాల్సిందే అని.. లేకపోతే కర్ణాటకలో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే తాను ప్రేమతోనే ఈ వ్యాఖ్యలు చేశానని.. క్షమాపణ చెప్పేదీ లేదని స్పష్టం చేశారు కమల్. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో కమల్.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కన్నడలో తన సినిమా విడుదల అయ్యేలా చూడాలని, అలాగే తనకు రక్షణ కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఎంత పెద్ద స్టార్ అయినా ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని, ఒక క్షమాపణ చెబితే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేవని కర్ణాటక హైకోర్టు హితవుపలికింది.
కోర్టు వ్యాఖ్యలపై కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గని కమల్.. క్షమాపణలు చెప్పేందుకు అంగీకరించకపోగా.. మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయడం లేదని ప్రకటించారు. ఈ వివాదం నేపథ్యంలో ఈ చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక షోలు నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు
ప్రజా తీర్పుకు ఏడాది.. పవన్ భావోద్వేగం
Read Latest National News And Telugu News