Share News

Kolkata rape case row: స్త్రీ ద్వేషం వ్యాఖ్యలపై మళ్లీ టీఎంసీ ఎంపీల మధ్య వార్

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:35 PM

లా విద్యార్థిని అత్యాచార ఘటనపై కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మహువా మెయిత్రా.. ఆయనొక 'స్త్రీ ద్వేషి' అంటూ ఘాటుగా విరుచుకుపడ్డారు. దీనిపై కల్యాణ బెనర్జీ కన్నెర్ర చేశారు.

Kolkata rape case row: స్త్రీ ద్వేషం వ్యాఖ్యలపై మళ్లీ టీఎంసీ ఎంపీల మధ్య వార్

కోల్‌కతా: కోల్‌కతా న్యాయ విద్యార్థినిపై అత్యాచారం ఘటన మరోసారి తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee), మహువా మొయిత్రా (Mahua Moitra)ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. లా విద్యార్థిని అత్యాచార ఘటనపై కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మహువా మెయిత్రా.. ఆయనొక 'స్త్రీ ద్వేషి' (Misogyny) అంటూ ఘాటుగా విరుచుకుపడ్డారు. దీనిపై కల్యాణ బెనర్జీ కన్నెర్ర చేశారు. ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన మహువానే అసలైన స్త్రీ వ్యతిరేకి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


వివాదం ఇలా...

దక్షిణ కోల్‌కతా లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనపై కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇటీవల విమర్శలకు గురయ్యాయి. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిపై అత్యాచారం చేస్తే అలాంటి సందర్భాల్లో ప్రభుత్వ అధికారులు ఎలా రక్షణ కల్పిస్తారు? విద్యాసంస్థలలో పోలీసులను మోహరించాలని అనుకుంటున్నారా? పోలీసులు ప్రతి మూలలోనూ ఉండలేరు అని కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అయితే నేరానికి పాల్పడిన వారు కఠిన శిక్షను ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. దీనిపై మహువా మొయిత్రా సామాజిక మాధ్యమంలో స్పందించారు. భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లోనూ స్త్రీ ద్వేషులు ఉన్నారని, ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా తమ పార్టీ ఖండిస్తుందని అన్నారు.


హనీమూన్ నుంచి తిరిగొచ్చి..

మహువా మెుయిత్రా 'స్త్రీ ద్వేషం' వ్యాఖ్యలపై కల్యాణ్ బెనర్జీ అంతే వేగంగా స్పందించారు. బీజేడీ మాజీ ఎంపీ పినాక మిశ్రాను ఆమె ఇటీవల వివాహం చేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమెపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. 'మహువా ఇప్పుడే హనీమూన్ ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. నా మీద ఫైటింగ్ మొదలుపెట్టేశారు. నేను మహిళా వ్యతిరేకినని ఆమె అంటున్నారు. మరి ఆవిడ మాటేంటి? 40 ఏళ్ల వైవాహిక జీవితాన్ని తెగతెంపులు చేసుకుని 65 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె ఒక మహిళను ఆవేదనకు గురిచేయలేదా?' అని ప్రశ్నించారు. నైతిక విలువలకు తిలోదికాలు వదిలిపెట్టినందుకు పార్లమెంటు నుండి బహిష్కరణకు గురైన ఒక ఎంపీ నాకు నీతులు చెబుతున్నారు. నిజమైన మహిళా వ్యతిరేకి ఆమెనే. భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలో, డబ్బులు ఎలా కూడబెట్టాలో ఆమెకు బాగా తెలుసు' అని ఘాటుగా విమర్శించారు.


గతంలోనూ మహువా, కల్యాణ్ తీవ్ర విమర్శలు చేసుకోవడంతో టీఎంసీ అధిష్ఠానం మహువాను మందలించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మహువా వెనక్కి తగ్గడంతో ఆమెకు పార్టీ మరోసారి ఎంపీ టిక్కెట్ ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

విజిలెన్స్ చర్యను నిలదీసిన ఎమ్మెల్యేపై ఐదేళ్ల సస్పెన్షన్ వేటు

మృత్యువుకే ఫ్లయింగ్‌ కిస్‌..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 05:45 PM