Jyoti Malhotra Case: జ్యోతి మల్హోత్రా కేసులో మరో ట్విస్ట్! ఎవరీ గడ్డం వ్యక్తి?
ABN , Publish Date - May 19 , 2025 | 04:01 PM
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉదంతం ఇప్పుడు దేశం మొత్తాన్ని షేక్ చేస్తోంది. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ మన ఆర్మీకి సంబంధించిన రహస్యాలను శత్రుదేశానికి చేరవేసిన జ్యోతి కేసులో ఒక్కొక్కటిగా విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భారత ఆర్మీకి చెందిన రహస్యాలను శత్రుదేశానికి చేరవేయడమే గాక పహల్గాం ఉగ్రదాడి ఘటనలోనూ జ్యోతికి ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఈ టెర్రర్ అటాక్ జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ఏరియాకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇదే సమయంలో జ్యోతితో సన్నిహితంగా ఉన్న ఓ గడ్డం వ్యక్తి.. పహల్గాం దాడి తర్వాత కేక్ తీసుకొని పాకిస్థాన్ ఎంబసీకి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో అసలు ఎవరీ గడ్డం వ్యక్తి.. అతడికి జ్యోతికి మధ్య ఉన్న సంబంధం ఏంటి.. పహల్గాం అటాక్‌లో అతడి ప్రమేయం ఉందా.. అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా..!
పహల్గాం ఉగ్రదాడి జరిగిన సరిగ్గా రెండ్రోజుల తర్వాత ఓ గడ్డం వ్యక్తి న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌కు వెళ్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేతిలో కేక్ పట్టుకొని, ఫోన్‌లో మాట్లాడుతూ ఆ వ్యక్తి పాక్ హైకమిషన్ భవనంలోకి వెళ్తుండగా.. మీడియా కెమెరాలు అతడ్ని క్లిక్‌మనిపించాయి. కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారు.. బర్త్‌డే లేదా ఏదైనా ఫంక్షన్ ఉందా.. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. అంటూ ఆ వ్యక్తిని జర్నలిస్టులు ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినా అతడు మాత్రం సమాధానం చెప్పకుండా పాక్ రాయబార కార్యాలయంలోకి వెళ్లిపోవడాన్ని వీడియోలో చూడొచ్చు.
కనెక్షన్ ఏంటి?
పాకిస్థాన్ హైకమిషన్ భవనంలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో గతంలో జ్యోతి మల్హోత్రా కలసి దిగిన ఫొటోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాక్ పర్యటన సమయంలో ఓ వేడుకలో జ్యోతి స్వయంగా తీసిన వీడియోలో ఈ గడ్డం వ్యక్తి కూడా ఉండటం గమనార్హం. దీంతో ఈ వ్యక్తి ఎవరు.. పాక్ రాయబార కార్యాలయంలోకి అతడు ఎందుకు వెళ్లాడు.. పహల్గాం ఉగ్రదాడి ప్లానింగ్‌లో అతడి పాత్ర ఉందా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, పహల్గాం దాడికి ముందు జ్యోతి పలుమార్లు పాక్‌లో పర్యటించిందని, అలాగే చైనాకూ వెళ్లొచ్చిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోని అధికారి డానిష్‌తో ఆమె టచ్‌లో ఉన్నట్లు నిర్ధారించారు. జ్యోతిని డానిష్ ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ఇదే తరుణంలో గడ్డం వ్యక్తితో జ్యోతి ఉన్న వీడియో, అతడు కేక్‌తో పాక్ రాయబార కార్యాలయానికి వెళ్తున్న వీడియోలు బయటకు రావడంతో అతడు ఎవరు.. డానిష్‌తో అతడికి ఉన్న కనెక్షన్ ఏంటి.. జ్యోతిని ట్రాప్ చేయడంలో అతడి పాత్ర ఉందా.. పహల్గాం దాడిలో అతడి రోల్ ఉందా.. అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పోలీసుల విచారణతో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
గోల్డెన్ టెంపుల్ని టార్గెట్ చేసిన పాక్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి