Indus Water Treaty: అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:44 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నీరు, రక్తం కలిసి ప్రవహించవని జైశంకర్ పునరుద్ఘాటించారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా నెహ్రూ చేసిన తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిచేసిందన్నారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌పై భారత్ విధించిన ఆంక్షల్లో భాగంగా నిలిపివేసిన సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) పై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) రాజ్యసభలో బుధవారంనాడు స్పష్టత ఇచ్చారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని శాశ్వతంగా విడిచిపెట్టేంతవరకూ నదీ జాలల ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నీరు, రక్తం కలిసి ప్రవహించవని ఆయన పునరుద్ఘాటించారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా నెహ్రూ చేసిన తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిచేసిందన్నారు.
'నెహ్రూ నేతృత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దలేమని ఆరు దశాబ్దాలుగా చెబుతూ వచ్చారు. కానీ వాటిని మార్చవచ్చని మోదీ ప్రభుత్వం చేసి చూపించింది. ఆర్టికల్ 370ను రద్దు చేశాం. ఇప్పుడు సింధూ జలాల ఒప్పందాన్ని సరిదిద్దుతున్నాం' అని జైశంకర్ చెప్పారు. అప్పటి నెహ్రూ ప్రపంచం శాంతి కోసం కాకుండా బుజ్జగింపు విధానాలతో సింధూ జలాల ఒప్పందంపై సంతకాలు చేశారని తప్పుపట్టారు.
మోదీ ప్రభుత్వ ప్రయత్నాల వల్లే ఉగ్రవాదం అనేది ఇవాళ్ల గ్లోబల్ ఎజెండా అయిందని జైశంకర్ చెప్పారు. ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్క్ ద్వారా పాకిస్థాన్‌పై భారత్ ఒత్తిడి తీసుకురాగలిగిందని, అంతర్జాతీ భద్రతా మండలిలో భారత్‌కు సభ్యత్వం లేకున్నా లష్కరే తొయిబా ప్రాక్సీ ది రిసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)పై ఆంక్షలు విధించేందుకు యూఎన్‌ను ఒప్పించగలిగిందని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తనపనేనంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకోవడాన్ని మంత్రి గుర్తు చేశారు.
కాల్పుల విరమణలో మూడో పార్టీ జోక్యం లేదు
ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగా పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడం వెనుక థర్ట్ పార్టీ ప్రమేయం ఏదీ లేదని జైశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్‌ను నిలపేయడం వెనుక ఎలాంటి వాణిజ్య కారణాలు కూడా లేవన్నారు. ఏప్రిల్ 22 - జూన్ 16 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని పేర్కొన్నారు. క్రాస్-బోర్డర్ టెర్రరిజాన్ని భారత్ ఎలాంటి పరిస్థితిల్లోనూ సహించేది లేదని, పాక్‌కు గుణపాఠం చెప్పేందుకే ఆపరేషన్ సిందూర్ నిర్వహించామని, పొరుగుదేశం మళ్లీ దాడులకు దిగితే ఆపరేషన్ సిందూర్ కూడా కొనసాగుతుందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
మీ ప్రవర్తన నమ్మశక్యంగా లేదు.. జస్టిస్ యశ్వంత్‌వర్మపై సుప్రీం వ్యాఖ్యలు
మేఘాలయ హనీమూన్ ట్రిప్ రాజా రఘువంశీ నిజ జీవితం ఆధారంగా మూవీ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి