Defense Framework: భారత్ అమెరికా మధ్య పదేళ్ల రక్షణ ఒప్పందం
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:08 AM
భారత్, అమెరికా దేశాలు తమ మధ్య వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతం దిశగా పదేళ్లకాలానికి రక్షణ ఒప్పందం చేసుకోనున్నాయి.

త్వరలోనే అమెరికా, భారత రక్షణ మంత్రులు పీట్ హెగ్సెత్, రాజ్‌నాథ్ సింగ్ సంతకాలు
న్యూఢిల్లీ, జూలై 3: భారత్, అమెరికా దేశాలు తమ మధ్య వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతం దిశగా పదేళ్లకాలానికి రక్షణ ఒప్పందం చేసుకోనున్నాయి. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మధ్య జరిగిన సుదీర్ఘంగా ఫోన్ చర్చల్లో ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంగా తేజస్ మార్క్ 1ఏ యుద్ధ విమానాల్లో వినియోగించే అమెరికన్ జీఈ సంస్థ నుంచి ఎఫ్404 ఇంజన్ల సరఫరాను వేగవంతం చేయాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు.
రక్షణ మంత్రుల చర్చల వివరాలతో అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘పదేళ్ల కాలానికి సంబంధించిన రక్షణ ఒప్పందంపై త్వరలో జరిగే సమావేశంలో సంతకాలు చేయాలని ఇరు దేశాల ఆర్థిక మంత్రులు నిర్ణయానికి వచ్చారు. పెండింగ్‌లో ఉన్న రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు, రక్షణ పరిశ్రమలకు సహకారం తదితర అంశాలపైనా వారు చర్చించారు. 2025 ఫిబ్రవరిలో ట్రంప్, మోదీ ప్రకటించిన ఉమ్మడి రక్షణ లక్ష్యాల సాధన దిశగా ఇరు దేశాలు గణనీయమైన పురోగతి సాధించాయని ఇరువురు నేతలు పేర్కొన్నారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.