Share News

Rajnath Singh ON Operation Sindhoor: ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఎంతవరకైనా వెళ్తాం

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:08 AM

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేసేందుకు నవీన భారతదేశం ఎంతవరకైనా వెళ్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

Rajnath Singh ON Operation Sindhoor: ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఎంతవరకైనా వెళ్తాం

22 నిమిషాల్లో పాక్‌లోని 7 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం

  • దాయాది తోక జాడిస్తే మళ్లీ సిందూర్‌.. లోక్‌సభ చర్చలో రాజ్‌నాథ్‌

  • మన విమానాలు ఎన్ని కూలాయో చెప్పాలి: కాంగ్రెస్‌

  • మన సైనికుల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసింది

  • కాల్పుల విరమణలో ట్రంప్‌ ప్రమేయం లేదు

  • సైనికుల సత్తాపై విపక్షాలకు అనుమానమా?

    పాక్‌ విమానాలు ఎన్ని కూల్చారని ప్రశ్నించరేం?

  • లోక్‌సభలో విపక్షాలపై రాజ్‌నాథ్‌ ధ్వజం

న్యూఢిల్లీ, జూలై 28: ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేసేందుకు నవీన భారతదేశం ఎంతవరకైనా వెళ్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. భారత సాయుధ దళాలు ఉగ్రవాద స్థావరాల ధ్వంసం విషయంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంతో ఆపరేషన్‌ సిందూర్‌కు విరామం ఇచ్చామని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై సోమవారం లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో రాజ్‌నాథ్‌ మాట్లాడారు. పాకిస్థాన్‌పై తీసుకున్న సైనిక చర్యతో భారత్‌ తన రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తుందని ఉగ్రవాదులు, వారి మద్దతుదారులకు గట్టి సందేశం ఇచ్చినట్లయిందని చెప్పారు. శాంతి వచనాలను అర్థం చేసుకోలేని వారిపై కఠిన చర్యలు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ‘‘మే 7న రాత్రి భారత బలగాలు తమ శక్తి, సామర్థ్యాలు చాటిచెప్పాయి. పీవోకే, పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపాయి. ఏడు ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్‌ పూర్తి చేశాయి. సైన్యానికి అభినందనలు. దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత’’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది తానేనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలను తిరస్కరించారు. మనపై ఎవరి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. పాక్‌ మళ్లీ తోక జాడిస్తే మళ్లీ ఆపరేషన్‌ను కొనసాగిస్తామన్నారు. ‘‘ఆపరేషన్‌ సిందూర్‌తో మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసింది. ఉగ్ర శిబిరాల్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను హతమార్చాం’’ అని రాజ్‌నాథ్‌ చెప్పారు. ‘‘మనం చేసిన దాడులతో పాక్‌ కాళ్ల బేరానికి వచ్చింది. మన త్రివిధ దళాలను తట్టుకోలేక పాక్‌ డీజీఎంవో వెంటనే మన కు ఫోన్‌ చేశారు. కాల్పుల విరమణ చేసుకుందామని మన డీజీఎంవోను కోరారు’’ అని స్పష్టం చేశారు.


పాక్‌ విమానాల గురించి అడగరేం?

మన సైనికుల సత్తాపై అనుమానాలు వ్యక్తం చేయడం, ప్రశ్నించడం సరికాదని రాజ్‌నాథ్‌ విపక్షాలకు హితవు పలికారు. ‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల పని. కానీ, మన ప్రతిపక్ష సభ్యులు మాత్రం మన యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయని పదేపదే ప్రశ్నిస్తుంటారు. మన దళాలు ఎన్ని పాకిస్థానీ విమానాలను కూల్చేశారని మాత్రం అడగరు’’ అని విపక్షాలపై ధ్వజమెత్తారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నామని.. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదని అన్నారు. ‘ఏ పరీక్షలో అయినా ఫలితం ముఖ్యం. అంతేకానీ పెన్సిల్‌ విరిగిందా?, పెన్ను పోయిందా? అన్నది విషయం కాదు’ అని వ్యాఖ్యానించారు. మన వైమానిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ క్షిపణులు, డ్రోన్లు ఇతర దీర్ఘశ్రేణి ఆయుధాలను వాడిందని.. వాటన్నింటినీ మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయని చెప్పారు.

అమెరికాకు సంబంధమే లేదు: జైశంకర్‌

ఆపరేషన్‌ సిందూర్‌కు, అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు. వాణిజ్యంపై ఏ దశలోనూ, ఎన్నడూ అమెరికాతో చర్చలే జరపలేదని లోక్‌సభలో తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడి నుంచి ప్రధాని మోదీకి ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాలేదని తేల్చిచెప్పారు. పాక్‌ డీజీఎంవో నుంచి విజ్ఞప్తి వచ్చిన తర్వాతే కాల్పుల విరమణ పాటించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో జైశంకర్‌ ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిలో 190 దేశాలకు గాను 187 దేశాలు ఆపరేషన్‌ సిందూర్‌కు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. జైశంకర్‌ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష సభ్యులు అంతరాయం కలిగిస్తుండడంతో హోంమంత్రి అమిత్‌ షా కల్పించుకున్నారు. తన సీటు నుంచి లేచి నిలబడి మాట్లాడుతూ.. ‘‘మన విదేశాంగ శాఖ మంత్రిపై ప్రతిపక్షాలకు నమ్మకం లేదు. వారికి వేరే దేశంపై ఉంది. వారి పార్టీలో విదేశానికి ఉండే ప్రాధాన్యం నాకు తెలుసు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


FGSN.jpg

మన యుద్ధ విమానాలు ఎన్ని కూలాయి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై చేసిన దాడుల్లో మన యుద్ధ విమానాలు ఎన్ని కూలాయని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష ఉప నేత గౌరవ్‌ గొగోయ్‌ ప్రశ్నించారు. నిఘా వర్గాల వైఫల్యం వల్లే పహల్గాం ఉగ్రదాడి జరిగిందని, దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ‘‘పహల్గాంకు ఉగ్రవాదులు వచ్చి ఎలా దాడి చేయగలిగారో రాజ్‌నాథ్‌ చెప్పలేదు. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు మేం తప్పకుండా కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ప్రభుత్వం వాటికి కచ్చితంగా సమాధానం చెప్పాలి’’ అని గొగోయ్‌ అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయి 100 రోజులు గడిచిందని.. ఇప్పటివరకు దాడికి కారకులను ప్రభుత్వం పట్టుకోలేకపోయిందని ప్రశ్నించారు. ‘‘ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతోందని చెబుతున్నారు. అలాంటప్పుడు ఇది విజయవంతమైందని ఎలా ప్రకటిస్తున్నారు’’ అని అడిగారు. పాకిస్థాన్‌ మనదేశం ముందు మోకరిల్లేందుకు సిద్ధమైనప్పుడు.. ‘మీరెందుకు యుద్ధాన్ని ఆపారు? ఎవరికి లొంగిపోయారు?’ అన్న విషయాన్ని ప్రధాని మోదీ వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 26 సార్లు ప్రకటించారని, ఐదారు యుద్ధ విమానాలు కూలిపోయాయని కూడా చెప్పారని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 04:08 AM