India Slams Pak: అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్
ABN , Publish Date - Nov 26 , 2025 | 08:35 PM
మతతత్వ రికార్డులతో మలినమైన వాళ్లకు ఇతరులకు నీతులు చెప్పే నైతికత ఎక్కడిదని పాక్‌ను భారత్ ప్రశ్నించింది. ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలంటూ దాయాది దేశానికి హితవు పలికింది.
న్యూఢిల్లీ: దాయాది దేశం పాక్ మరోసారి భారత్‌పై విషం చిమ్మింది. అయోధ్యలోని రామాలయంపై కాషాయ జెండా ఎగురవేయడంపై వక్రభాష్యం చెప్పింది. పాక్ కారుకూతలకు అంతే ఘాటుగా భారత్ బుధవారంనాడు స్పందించింది. మతతత్వ రికార్డులతో మలినమైన వాళ్లకు ఇతరులకు నీతులు చెప్పే నైతికత ఎక్కడిదని ప్రశ్నించింది. ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలంటూ పాక్‌కు హితవు పలికింది. పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) బుధవారంనాడు ఘాటుగా స్పందించారు.
'పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలు గమనించాం. ఆ వ్యాఖ్యలు ఎంత మాత్రం అర్హమైనవి కావని ఖండిస్తున్నాం. మతతత్వం, అణిచివేత, మైనారిటీలపై అనుచిత ప్రవర్తనతో మరక పడిన రికార్డు ఉన్న పాక్‌కు ఇతరులకు బోధించే నైతికత లేదు' అని జైశ్వాల్ అన్నారు. కపట ధర్మాలు బోధించడానికి బదులు పాకిస్థాన్ తన సొంత మానవహక్కుల రికార్డుపై దృష్టి సారించడం మంచిదని హితవు పలికారు.
పాకిస్థాన్ ఏమంది?
అయోధ్యలోని రామాలయ నిర్మాణం పూర్తికావడంతో మరో అద్భుత ఘట్టం మంగళవారంనాడు ఆవిష్కృతమైంది. రామాలయ ధ్వజారోహణ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. దీనిపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ విషం కక్కింది. మతపరమైన మైనారిటీలపై ఒత్తిడి పెంచడం, ముస్లిం వారసత్వాన్ని తుడిచిపెట్టే చర్యగా దీనిని అభివర్ణించింది.
ఇవి కూడా చదవండి..
రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ
ఎందరో త్యాగధనుల కలలు నేటితో సాకారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.