Mallikarjun Kharge: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఖర్గే కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:02 PM
నవంబర్ 20వ తేదీతో సిద్ధరామయ్య ప్రభుత్వం తొలి రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అయితే 2023లో కుదిరిన ఒప్పందం ప్రకారం తదుపరి రెండున్నరేళ్ల పాలన డీకేకు అప్పగించాలని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు.
న్యూఢిల్లీ: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు తీవ్రమవుతున్నాయి. రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమర్ ప్రయత్నాలు చేశారని, స్వయంగా తానే ఫోన్ చేస్తానని, వేచిచూడాలని రాహుల్ సంక్షిప్తంగా సమాధానం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో నాయకత్వ మార్పు జరిగే అవకాశాలపై ఏఐసీసీ అధ్యక్షుడు అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారంనాడు స్పష్టత ఇచ్చారు. రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయం ఉంటుదని చెప్పారు.
'ప్రభుత్వం ఏమి చేస్తోందనేది అక్కడి ప్రజలే చెప్పాలి. అలాంటి అంశాలను మేము పరిష్కరిస్తాం. పార్టీ అధిష్ఠానంలో ఉన్న సోనియాగాంధీ, రాహుల్, నేను కలిసి దీనిపై చర్చిస్తాం. అవసరమైన పక్షంలో మేము మధ్యవర్తిత్వం చేస్తాం' అని ఖర్గే తెలిపారు.
కోల్డ్ వార్ ఏమిటి?
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య కొద్దికాలంలో నాయకత్వ అంశంపై 'కోల్డ్ వార్' నడుస్తోంది. ఇద్దరి మధ్య విభేదాలున్నాయనే ప్రచారం కూడా ఉంది. అయితే సిద్ధరామయ్య మాట తమకు వేదవాక్కని, ఆయన పెద్దనేత అని, పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని డీకే అంటున్నారు. నవంబర్ 20వ తేదీతో సిద్ధరామయ్య ప్రభుత్వం తొలి రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అయితే 2023లో కుదిరిన ఒప్పందం ప్రకారం తదుపరి రెండున్నరేళ్ల పాలన డీకేకు అప్పగించాలని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. అయితే అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని సిద్ధరామయ్య ఇటీవల పేర్కొన్నారు. అదిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరికీ వర్తిస్తుందని, అందుకు తాను, డీకే కూడా మినహాయింపు కాదని అన్నారు. ఈ తరహా గందరగోళానికి అధిష్ఠానం ముగింపు పలకాలని కోరారు.
సీక్రెట్ డీల్‌పై డీకే
సీఎం మార్పు వ్యవహారంపై డీకే శివకుమార్ మాట్లాడుతూ, పార్టీలో నలుగురు-ఐదుగురు మధ్య జరిగే రహస్య ఒప్పదంపై తాను బహిరంగంగా మాట్లాడాలని అనుకోవడం లేదన్నారు. తనను సీఎంను చేయాలని హైకమాండ్‌ను అడగలేదని చెప్పారు. పార్టీకి ఇబ్బంది కలిగించడం, బలహీన పరచడం తనకు ఇష్టం లేదని చెప్పారు. పార్టీ, కార్యకర్తల వల్లనే తాము ఈ స్థాయిలో ఉన్నామని, తదుపరి ఎన్నికల్లో పార్టీకి ఘనవిజయం చేకూర్చడమే తన లక్ష్యమని చెప్పారు. అయితే అలాంటి 'సీక్రెట్ డీల్' ఏదీ లేదని సిద్ధరామయ్య సన్నిహితులు చెబుతున్నారు. గాంధీ కుటుంబంతో డీకేకు మంచి సాన్నిహిత్యం, విధేయత ఉన్నందున అసమ్మతి అనే ప్రసక్తే లేదని అంటున్నారు. కాగా, డిసెంబర్ 1న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి నాయకత్వ మార్పు అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
41 మంది మావోయిస్టుల లొంగుబాటు.. వీరిలో 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు
టీ షర్టు వివాదంలో కునాల్ కమ్రా.. బీజేపీ, శివసేన వార్నింగ్
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.