Share News

CM Stalin: నాన్న ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చాను..

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:09 PM

తన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 15 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీని ఎట్టకేలకు తాను నెరవేర్చానని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోయంబత్తూరులో సెమ్మొళి పూంగాను నిర్మిస్తానంటూ కరుణానిధి హామీని ఇప్పుడు నెరవేర్చానన్నారు.

CM Stalin: నాన్న ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చాను..

- కోవైలో సెమ్మొళి పూంగా ప్రారంభంపై స్టాలిన్‌

చెన్నై: కోయంబత్తూరులో సెమ్మొళి పూంగాను నిర్మిస్తానంటూ తన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 15 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీని ఎట్టకేలకు తాను నెరవేర్చానని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆయన ఓ సందేశం విడుదల చేశారు. 2010లో కోవైలో జరిగిన ప్రపంచ తమిళ ప్రాచీన భాషా మహానాడులో సెమ్మొళి పూంగాను ఏర్పాటు చేయనున్నట్లు అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకటించారని గుర్తు చేశారు.


nani2,2.jpg

ఆ మేరకు 2021లో డీఎంకే ప్రభుత్వం అధికారంలో రాగానే సెమ్మొళి పూంగా పనులు ప్రారంభించనున్నట్లు ప్రకటించి, 2023లో శంకుస్థాపన చేశానని, మంగళవారం మధ్యాహ్నం ఆ ఉద్యానవనాన్ని ప్రారంభించడం తనకెంతో సంతోషా న్ని కలిగిస్తోందన్నారు. కోయంత్తూరులో గాంధీపురం సెంట్రల్‌ జైలు ప్రాంగణంలో 165 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న ఉద్యానవన ప్రాజెక్టులో తొలివిడతగా 45 ఎకరాల్లో రూ.208.50 కోట్లతో అన్ని హంగులతో నిర్మించిన ‘సెమ్మొళి పూంగాను’ ఆయన మంగళవారం ప్రారంభించారు. ఆ తర్వాత బ్యాటరీ కారులో తన మంత్రివర్గ సహచరులు, అధికారులతో కలిసి పూంగా అంతటా పర్యటించారు.


nani2.3.jpg

ఆ తర్వాత శెట్టిపాళయం నగర పంచాయతీ ఓరాట్టుకుప్పయ్‌ గ్రామంలో జీడీ నాయుడు ట్రస్టు అందించిన రూ.5.67 కోట్ల వ్యయంతో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన 86 ఇళ్ళను కూడా ప్రారంభించి, లబ్దిదారులకు ఇంటి పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, ఎంపీ సామినాఽథన్‌, టీఆర్బీ రాజా, ఎన్‌.కయల్‌విళి సెల్వరాజ్‌, ఎంపీలు గణపతి రాజ్‌కుమార్‌, ఈశ్వరసామి, శాసనసభ్యులు వి.సెంథిల్‌బాలాజీ, నగరపాలక నిర్వహణ నీటి సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి డి.కార్తికేయన్‌, నగరపాలక నిర్వహణా సంచాలకులు పి.మఽథుసూదన్‌ రెడ్డి, కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌ పవన్‌కుమార్‌ కె.గిరియప్పన్వర్‌, కోయంబత్తూరు కార్పొరేషన్‌ మేయర్‌ కె.రంగనాయకి రామచంద్రన్‌, కమిషనర్‌ ఎం.శివగురు ప్రభాకరన్‌, డిప్యూటీ మేయర్‌ ఆర్‌ వెట్రిసెల్వన్‌ తదితరులు పాల్గొన్నారు.


పార్కులో ప్రత్యేకతలు...

సీఎం స్టాలిన్‌ ప్రారంభించిన సెమ్మొళి పూంగాను 23 రకాల ఉద్యానవనాల సముదాయంగా నిర్మించారు. హెర్బల్‌ గార్డెన్‌, పొప్పొడి తోట, వాటర్‌ గార్డెన్‌, లిల్లీ గార్డెన్‌, ఫ్లవర్‌ గార్డెన్‌, వెదురుతోట, గులాబీల తోట, పచ్చదనం పరచకున్న చిట్టడవులు, సంగ సాహిత్యంలో ప్రస్తావించిన వృక్షాలు, పూల మొక్కలున్నాయి. రెండు వేల రకాలకు పైగా గులాబీ మొక్కలు కూడా ఈ ఉద్యానవనంలో పెంచారు. 500 మంది కూర్చునేలా ఓపెన్‌ ఎయిర్‌ హాల్‌, పార్కు సిబ్బందికి గదులు, రెస్టారెంట్‌, రిటైల్‌ అవుట్‌ లెట్‌, కృత్రిమ జలపాతం కూడా ఉన్నాయి. ఈ ఉద్యానవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో 453 కార్లు నిలిచేందుకు పార్కింగ్‌ ఏరియా, 10 బస్సులు, 1000 ద్విచక్రవాహనాలు పార్కింగ్‌ చేయడానికి అనువైన స్థలం ఉన్నాయి. అంతే కాకుండా ఈ పార్కులో జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రెండు కిలోమీటర్ల పొడవైన వర్షపునీటి సంరక్షణ డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు

మావోయిస్టుల కస్టడీ పిటిషన్‌ వెనక్కి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2025 | 12:09 PM