Share News

Covid-19: 4,302కు చేరిన కొవిడ్ కేసులు.. 24 గంటల్లో ఏడుగురు మృతి

ABN , Publish Date - Jun 04 , 2025 | 06:47 PM

కొవిడ్ యాక్టివ్ కేసుల్లో ముందున్న కేరళలో తాజాగా 43 కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,373కు చేరింది. పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 60 కేసులు నమోదై 432కు చేరుకున్నాయి. ఢిల్లీలో కొత్తగా 64 కేసులు నమోదై 457కు చేరింది.

Covid-19: 4,302కు చేరిన కొవిడ్ కేసులు.. 24 గంటల్లో ఏడుగురు మృతి

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కొవిడ్ (Covid-19) కేసుల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,302కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఏడుగురు మృతి చెందినట్టు సమాచారం. వీరిలో ముగ్గురు 22-27 ఏళ్ల మధ్యలో ఉన్నారని, వీరిలో శ్వాస సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. మహారాష్ట్రలో 4, తమిళనాడు, ఢిల్లీలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.


కొవిడ్ యాక్టివ్ కేసుల్లో ముందున్న కేరళలో తాజాగా 43 కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,373కు చేరింది. పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 60 కేసులు నమోదై 432కు చేరుకున్నాయి. ఢిల్లీలో కొత్తగా 64 కేసులు నమోదై 457కు చేరింది. గత కరోనా మహమ్మారి సమయంలో తీవ్ర ప్రభావం కనిపించిన మహారాష్ట్రలో కొత్తగా 16 యాక్టివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 510కి చేరింది.


వ్యాధి లక్షణాలు కనిపించిన వారిలో సబ్‌వేరియంట్స్ ఎల్.7, ఎన్‌బీ.1.8.1లు వేరియంట్లుగా గుర్తించామని, అయితే ఇవి ఆందోళన కలిగించే వేరియంట్లా కాదా అనేది మానిటర్ చేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తెలిపింది.


కాగా, కొత్త సబ్ వేరియంట్లు వెలుగుచూస్తున్నప్పటికీ జేఏన్-1 వేరియంట్ ఎక్కువ మందిలో కనిపిస్తోందని, 53 శాతం పాజిటివ్ కేసుల్లో ఈ వేరియంట్ కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో తమిళనాడులో ఎన్‌బీ.1.8.1 వేరియంట్ కనిపించగా, ఈ నెల ప్రారంభంలో గుజరాత్‌లో నాలుగు కేసుల్లో ఎల్ఎఫ్.7 ఉన్నట్టు గుర్తించారు. ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, శ్వాససంబంధిత ఇబ్బందులు, గొంతు సమస్యలు, జీర్ణాశయంలో ఇబ్బందులు ఉంటే సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర సూచనలిస్తోంది.


ఇవి కూడా చదవండి..

జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

ఓవైపు వివాదం.. మరోవైపు సర్కార్ అండ.. కమల్‌కు గుడ్‌న్యూస్

For National News And Telugu News

Updated Date - Jun 04 , 2025 | 06:47 PM