Share News

India - China: భారత్‌ - చైనా చర్చలు.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి

ABN , Publish Date - Oct 29 , 2025 | 01:50 PM

భారత్- చైనా సరిహద్దు ప్రాంతాల్లో సంయుక్తంగా శాంతిని కాపాడేందుకు అంగీకరించారని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ చర్చల విషయాన్ని తాజాగా భారత ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది.

India - China: భారత్‌ - చైనా చర్చలు.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి

ఢిల్లీ: భారత్‌ - చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. చుషుల్‌-మోల్దో సరిహద్దుల్లో ఈనెల 25న భారత్‌ భూభాగంలో చర్చలు జరిగినట్లు తెలిపింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా.. ఏడు ఘర్షణ పాయింట్ల నుంచి ఇరువైపులా.. సైన్యాన్ని పూర్తిగా తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐదు పాయింట్ల నుంచి.. పెట్రోలింగ్ పునఃప్రారంభమైందన్నారు. తూర్పు లడఖ్‌లోని సరిహద్దుల్లో ఉద్రిక్తత పూర్తిగా తగ్గిందని విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేశారు.


భారత్- చైనా సరిహద్దు ప్రాంతాల్లో సంయుక్తంగా శాంతిని కాపాడేందుకు అంగీకరించారని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ చర్చల విషయాన్ని తాజాగా భారత ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. సరిహద్దుల్లో సమస్యల పరిష్కారం, స్థిరీకరణ తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని పేర్కొంది. ఈ చర్చలు స్నేహపూర్వక, సంతోషకరమైన వాతావరణంలో జరిగాయని వెల్లడించింది. ఈ సమావేశంలో కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయి అధికారులు, జనరల్ స్థాయి ప్రత్యేక అధికారులు హాజరయ్యారు.


2025 ఆగస్టు 19న జనరల్‌ స్థాయి ప్రత్యేక అధికారుల 24వ చర్చల తర్వాత పశ్చిమ కమాండ్‌లో జనరల్ లెవల్ మెకానిజం కోసం జరిగిన తొలి భేటీ ఇదే అని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. 2024 అక్టోబర్‌లో జరిగిన 22వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం తర్వాత పురోగతిని ఈ సమావేశంలో ఇరుపక్షాలు సమీక్ష జరిపాయని తెలిపారు. గత ఏడాది చర్చల తర్వాత.. ఇప్పటి వరకు సరిహద్దు ప్రాంతాలలో శాంతియుత వాతావరణం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న శాంతిని కొనసాగించేందుకు.. ఏవైనా సమస్యలు వస్తే ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చి పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌-చైనా విదేశాంగ శాఖలు వెల్లడించాయి.


ఇవి కూడా చదవండి..

United Aircraft Corporation: భారత్‌లో పౌర విమానాల తయారీ

Lufthansa Flight Incident: లుఫ్తాన్సా విమానంలో ఘర్షణ

Updated Date - Oct 29 , 2025 | 02:02 PM