Ceasefire Agreement: సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గిద్దాం
ABN , Publish Date - May 13 , 2025 | 04:23 AM
భారత్-పాక్ డీజీఎంవోలు హాట్‌లైన్ భేటీలో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు సైన్యాన్ని తగ్గించాలని, డ్రోన్, మిసైల్ దాడులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. అయినప్పటికీ, మోదీ ప్రసంగానంతరం పాక్ డ్రోన్లు భారత్‌లోకి ప్రవేశించగా, వాటిని భారత సైన్యం సమర్థంగా కూల్చివేసింది.

డ్రోన్లు, మిసైల్స్ దాడులు జరగొద్దు
కాల్పుల విరమణను పాటిద్దాం
భారత్-పాక్ డీజీఎంవోల భేటీలో నిర్ణయం
కాసేపటికే భారత్ భూభాగంలోకి పాక్ డ్రోన్లు
సమర్థంగా కూల్చేశామన్న భారత సైన్యం
ఎలాంటి ఆందోళన అవసరం లేదని వెల్లడి
సాంబ, హోషియార్‌పూర్‌లో బ్లాకవుట్
పాక్ వైమానిక స్థావరాలకు చావుదెబ్బ
11 ఎయిర్‌బేస్‌లపై భీకర దాడులు
‘ఆపరేషన్ సిందూర్’పై డీజీఎంవోల వెల్లడి
కిరానా హిల్స్‌పై దాడి చేయలేదు: ఏకే భారతి
న్యూఢిల్లీ, మే 12: నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించాలని భారత్-పాక్‌కు చెందిన మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్(డీజీఎంవో) నిర్ణయించారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇరువురు డీజీఎంవోలు హాట్‌లైన్‌లో దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి మధ్యాహ్నం 12 గంటలకే వీరి భేటీ జరగ్గా.. కాసేపటికి సమావేశాన్ని సాయంత్రానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా సరిహద్దు వెంబడి ఇరువైపులా సైన్యాన్ని తగ్గించాలని నిర్ణయించారు. డ్రోన్లు, మిసైల్ దాడులు జరగొద్దని ఆకాంక్షించారు. ఒకవేళ ఒక తూటా పేలినా.. సీరియ్‌సగా పరిగణించాలని తీర్మానించారు. ఈ నెల 10న కాల్పుల విరమణపై ఇరుదేశాల నుంచి ప్రకటనలు వెలువడిన వెంటనే.. డీజీఎంవోల సమావేశాన్ని ఖరారు చేసిన విషయం తెలిసిందే..! సాధారణంగా వీరి భేటీ మంగళవారాల్లో ఉంటుంది. దీన్ని బట్టి.. మంగళవారం కూడా మరోమారు హాట్‌లైన్ సమావేశం జరిగే అవకాశాలున్నాయి. కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించిన కాసేపటికే.. భారత గగనతలంలోకి పాకిస్థాన్‌కు చెందిన పలు డ్రోన్లు ప్రవేశించాయి. తొలుత పఠాన్‌కోట్ వద్ద రాత్రి 8.30 సమయంలో ఒకటి.. బమియాల్ వద్ద రెండు నిఘా డ్రోన్లను గుర్తించినట్లు బీఎ్‌సఎఫ్ వర్గాలను ఉటంకిస్తూ.. జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది. రాత్రి 9.20 సమయంలో జలంధర్, సాంబ సెక్టార్ వద్ద నిఘా డ్రోన్లను సైన్యం కూల్చివేసింది. అమృత్‌సర్ వైపు డ్రోన్లు దూసుకురావడంతో.. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఇండిగో విమానం వెనుదిరిగింది. ఆయా ప్రాంతాల్లోని డ్రోన్లను సమర్థంగా కూల్చివేశామని, ప్రస్తుతం సరిహద్దుల వద్ద పరిస్థితి ప్రశాంతంగా ఉందని సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా జమ్మూకశ్మీర్‌లోని సాంబ, హోషియార్‌పూర్‌లో బ్లాకౌట్‌ను ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.