Malegaon Blast Case: ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను అరెస్టు చేయాలని ఆదేశాలు.. మాజీ పోలీసు అధికారి వెల్లడి
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:57 PM
దర్యాప్తును తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరిగిందని, దీనికి తాను అభ్యంతరం చెప్పడంతో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ముజావర్ తెలిపారు. 2009 మార్చిలో మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయ్యారు.

ముంబై: సంచలనం సృష్టించిన 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు (Malegaon blast case) విచారణ బృందంలో ఉన్న యాంటీ-టెర్రర్ స్క్వాడ్ (ATS) మాజీ అధికారి మహబూబ్ ముజావర్ (Mehaboob Mujawar)కీలక ఆరోపణలు చేశారు. విచారణ సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat)ను ఆరెస్టు చేయాలని తనకు ఆదేశాలు వచ్చాయని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మాలేగావ్ కేసులో నిందితులు ఏడుగురిని ముంబై ప్రత్యేక కోర్టు గురువారం నాడు నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో ముజావర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కేసులో నిర్దోషులుగా బయపడిన ఏడుగురిలో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నర్ ప్రసాద్ పురోహిత్ కూడా ఉన్నారు.
దర్యాప్తును తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరిగిందని, దీనికి తాను అభ్యంతరం చెప్పడంతో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ముజావర్ తెలిపారు. 2009 మార్చిలో మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయ్యారు. ఆయనను అరెస్టు చేయాల్సిందిగా చీఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి పరమ్ బీర్ సింగ్ సహా పలువురు అధికారులు తనకు ఆదేశాలిచ్చారని ఆయన తెలిపారు. అయితే అధికారుల ఆదేశాలు పాటించేందుకు తాను నిరాకరించడంతో తనపై కేసులు పెట్టారని, ఆ తర్వాత తాను నిర్దోషిగా బయటకు వచ్చానని చెప్పారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముజావర్‌ను సస్పెండ్ చేసింది.
మాలేగావ్ కుట్ర బయట పడింది: దేవేంద్ర ఫడ్నవిస్
ముజావర్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. 2008 కుట్ర బయటపడిందని వ్యాఖ్యానించారు. అప్పటి ప్రభుత్వం హిందూ టెర్రర్, సఫ్రాన్ టెర్రరిజం వంటి పదాలను వాడిందని గుర్తు చేశారు. అప్పట్లో ఇస్లామిక్ టెర్రరిజం గురించి అంతా మాట్లాడుకుంటున్నారని, తమకు ఓట్లు వేసిన వాళ్ల ఆగ్రహం చవిచూకకుండా ఉండేందుకే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ టెర్రరిజం థియరీని లేవదీసిందన్నారు.
మాలేగావ్ పేలుళ్ల ఘటన నవరాత్రి పండుగకు కొద్దిగా ముందు రంజాన్ మాసంలో చోటుచేసుకుందని, ముస్లిం కమ్యూనిటీని భయభ్రాంతులను చేసేందుకే ఈ ఘటన జరిగిందని అప్పట్లో ఎన్ఐఏ వ్యాఖ్యానించింది. 2008 సెప్టెంబర్ 29న జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. 2018లో విచారణ ప్రారంభమై ఈ ఏడాది ఏప్రిల్ 19తో పూర్తయింది. మోటార్ బైక్‌లో పేలుడు పదార్ధాన్ని అమర్చినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని ప్రత్యేక కోర్టు బుధవారంనాడు పేర్కొంటూ నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం.. తప్పుపట్టిన ఈసీ
అత్యాచారం కేసులో మాజీ ఎంపీ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి