Guru Tegh Bahadur: గురు తేగ్ బహదూర్ త్యాగం నిరుపమానం.. షహీదీ దివస్‌లో మోదీ
ABN , Publish Date - Nov 25 , 2025 | 08:24 PM
మొఘలుల హయాంలో తేగ్ బహదూర్ ఎంతో సాహసం చూపించారని, కశ్మీరీ పండిట్లను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేస్తుంటే దానిని వ్యతిరేకించి, కశ్మీరీ హిందువులకు అండదండగా నిలిచారని గుర్తుచేశారు.
కురుక్షేత్ర: సిక్కుల తొమ్మిదో గురువు తేగ్ బహదూర్ (Guru Tegh Bahadur)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఘన నివాళులర్పించారు. సత్యం, ధర్మం, విశ్వాసాలకు ఆయన ప్రతిరూపమని అభివర్ణించారు. మంగళవారంనాడిక్కడ జరిగిన గురు తేగ్ బహదూర్ 350వ అమరవీరుల వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. గురు తేగ్ బహదూర్ స్మారక నాణెం, తపాలా బిళ్లను విడుదల చేశారు.

'సత్యం, ధర్మం పరిరక్షణకు కృష్ణ భగవానుడు నిలిచిన గడ్డ ఇది. గురు తేగ్ బహదూర్ సైతం సత్యం, ధర్మ, మత విశ్వాసాల పరిరక్షలుగా నిలిచారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని గురు తేగ్ బహదూర్ స్మారక తపాలా బిల్ల, నాణెం విడుదల చేస్తున్నందుకు భారత ప్రభుత్వం గర్విస్తోంది. గురు సాంప్రదాయాన్ని ఇదే విధంగా కొనసాగించాలని అభిలషిస్తున్నాం' అని మోదీ అన్నారు.
మొఘలుల హయాంలో తేగ్ బహదూర్ ఎంతో సాహసం చూపించారని, కశ్మీరీ హిందువులను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేస్తుంటే దానిని వ్యతిరేకించి, వారికి అండగా నిలిచారని గుర్తుచేశారు. ఆయన జీవితం, త్యాగం, క్యారెక్టర్ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఔరంగజేబు పాలనలో కూడా తేగ్ బహదూర్ తన సిద్ధాంతాల విషయంలో ఎలాంటి రాజీ పడలేదని, మత పరిరక్షణకు తన తలను కూడా సమర్పించారని అన్నారు.

పాంచజన్య మెమోరియల్
కాగా, కురుక్షేత పర్యటనలో భాగంగా శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధంలో వాడిన పవిత్ర శంఖం పాంచజన్యం గుర్తుగా నిర్మించిన 'పాంచజన్య మెమోరియల్'ను ప్రధాని ప్రారంభించారు. హర్యానా ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ కూడా ప్రధాని వెంట పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎందరో త్యాగధనుల కలలు నేటితో సాకారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్
రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.