Mamata Banerjee: బిహార్‌ను టచ్ చేస్తే దేశాన్ని కుదిపేస్తాం.. ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీలో సీఎం
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:32 PM
ఎస్ఐఆర్ ప్రక్రియను ఇంత హడావిడిగా చేపట్టటాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు. హడావిడి వ్యవహారంతో ఓటర్ల జాబితా నుంచి ప్రజలను తప్పించాలని చూస్తే బీజేపీని విడిచిపెట్టేది లేదని అన్నారు.
కోల్‌కతా: బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ఫలితంగానే ఎన్డీయే విజయం సాధించిందని, బీజేపీ 'గేమ్'ను అర్థం చేసుకోవడంలో విపక్షాలు విఫలమయ్యాయని పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా బనగావ్ (Bongaon)లో మంగళవారంనాడు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బెంగాల్‌లో బీజేపీ గేమ్‌లు చెల్లవని అన్నారు.
'బిహార్‌లో ఎన్నికలు జరిగాయి. పాపం..అక్కడి ప్రతిపక్ష నాయకులు బీజేపీ గేమ్‌ను గ్రహించలేకపోయారు. కానీ మాకు వాళ్ల గేమ్‌లు ఏమిటో బాగా తెలుసు. వాళ్ల ఆటలు బెంగాల్‌లో ఎంతమాత్రం సాగవు. బెంగాల్‌ను టచ్ చేయాలని చూస్తే మేము యావద్దేశాన్ని కుదిపేస్తాం' అని సీఎం తీవ్ర స్వరంతో అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో బంగ్లాదేశీ హిందువులకు సమస్యలు సృష్టించాలని అనుకుంటున్నారని, ఎస్ఐఆర్ కారణంగా 35 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. డూప్లికేట్ ఓటర్లను సృష్టించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ)ను వాడుతున్నారని, ఇది బీజేపీ ప్లాన్ అని ఆరోపించారు.
ఓటేసిన వారిని తప్పిస్తే ప్రభుత్వాన్నీ తప్పించాలి..
ఎస్ఐఆర్ ప్రక్రియను ఇంత హడావిడిగా చేపట్టడాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు. హడావిడి వ్యవహారంతో ఓటర్ల జాబితా నుంచి ప్రజలను తప్పించాలని చూస్తే బీజేపీని విడిచిపెట్టేది లేదని అన్నారు. ఇప్పటి ఓటర్ల జాబితాతోనే 2024లో ప్రధాని ఓట్లు సంపాదించారని, ఇప్పుడు అదే ఓటర్లను తప్పిస్తే.. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పించాలని అన్నారు. తాను ఇక్కడ ఉన్నంత వరకూ ప్రజలను ఓటర్ల జాబితా నుంచి ఎవరూ తప్పించలేరని స్పష్టం చేశారు.
చొరబాట్లపై నిలదీయాల్సింది వారినే..
దేశంలో చొరబాటుదార్ల ప్రవేశంపై మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఈ విషయంపై తనను ప్రశ్నించాల్సిన పనే లేదని, కేంద్ర ఏజెన్సీలే సరిహద్దులను నిర్వహిస్తున్నాయని అన్నారు. రైల్లు, విమానాలు, సరిహద్దుల భద్రత సెంట్రల్ ఏజెన్సీలే చూసుకుంటాయని, పాస్‌పోర్టులు, కస్టమ్స్, ఎక్సైజ్ జాగ్రత్తలు తీసుకునేది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎందరో త్యాగధనుల కలలు నేటితో సాకారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్
రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.