CEC: బీఎల్ఓల మరణాలపై సీఓలను నివేదిక కోరిన సీఈసీ
ABN , Publish Date - Nov 25 , 2025 | 07:00 PM
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ విధుల్లో ఉన్న పలువురు బీఎల్ఓలు తీవ్రమైన పనిభారం, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మూడు వారాల్లో 16 మంది మరణించినట్టు కథనాలు రావడం కూడా రాజకీయ వివాదానికి దారితీసింది.
న్యూఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అధిక పనిభారం, ఒత్తిడి కారణంగా బూత్ లెవెల్ అధికారులు (BLOs) పలువురు మరణించినట్టు ఆరోపణలు వస్తుండటంపై భారత ఎన్నికల సంఘం (ECI) దృష్టి సారించింది. దీనిపై వివరాలు కోరుతూ 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల (CEOs) నుండి మంగళవారంనాడు నివేదికలను కోరింది. బీఎల్ఓలు పని ఒత్తిడి కారణంగా మరణిస్తున్నారని, ఎస్ఐఆర్‌ను నిలిపివేయాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తాజా చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ విధుల్లో ఉన్న కొందరు బీఎల్ఓలు తీవ్రమైన పనిభారం, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మూడు వారాల్లో 16 మంది బీఎల్ఓలు మరణించినట్టు కథనాలు రావడం కూడా రాజకీయ వివాదానికి దారితీసింది. కేంద్ర ఎన్నికల సంఘం హడావిడి ప్రక్రియపై పలు పార్టీలు విమర్శలు గుప్పించాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ మరణాలు నమోదైనట్టు కథనాలు వచ్చాయి.
బీఎల్ఓల మరమాణాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవి ఎస్ఐఆర్ సంస్కరణలు కావని, బలవంతంగా రుద్దుతున్న నిరంకుశత్వమని రాహుల్ విమర్శించారు. ఈ ప్రక్రియతో ఇంకా ఎన్ని ప్రాణాలు కోల్పోవాలి? ఎన్ని మృతదేహాలు చూడాలని మమతాబెనర్జీ ప్రశ్నించారు. బీఎల్‌ఓలకు సరైన వనరులు కల్పించకుండా హడావిడిగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడమే ఈ మరణాలకు కారణమని అన్నారు. ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని బనగావ్‌లో మమతాబెనర్జీ మంగళవారంనాడు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
బిహార్‌ను టచ్ చేస్తే దేశాన్ని కుదిపేస్తాం.. ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీలో సీఎం
రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.