Ganga Yamuna Flood: వరదల తాకిడికి వారణాసి-ప్రయాగ్‌రాజ్ అతలాకుతలం.. అఖిలేష్ యాదవ్ ఆగ్రహం
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:43 PM
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలతో వరదలు భారీగా సంభవించాయి. ప్రధానంగా వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా పవిత్ర నగరాలైన వారణాసి, ప్రయాగ్‌రాజ్ వరదల తీవ్రతకు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. గంగా, యమునా (ganga yamuna flood) నదులు ఉప్పొంగి పొర్లుతూ తీరప్రాంతాల్లోని జనజీవితాన్ని ముంచెత్తుతున్నాయి. రహదారులు జలమయమై, ఇళ్లలోకి నీరు ప్రవేశించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రక్షణ బృందాలు, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాస పనుల్లో నిమగ్నమవుతున్నారు. నదుల ఉద్ధృతి తగ్గకపోతే పరిస్థితి మరింత విషమించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గంగా ఉగ్రరూపం
వారణాసిలో గంగా నది ప్రమాద స్థాయిని దాటి అనేక ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకొచ్చింది. ప్రయాగ్‌రాజ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నదీ జలాలు పెరిగి, నగరంలోని పలు ప్రాంతాలు నీటిలో మునిగాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో, ప్రజలు పడవల్లో ప్రయాణిస్తూ పలు ఇళ్లు, ఆఫీసులకు వెళ్తున్నారు. రోడ్డు మీద కారు కాదు, పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రయాగ్‌రాజ్‌లోని కరేలా బాగ్ ప్రాంతంలో ఉదయం 8 గంటల నుంచే నీరు నిలిచిపోయింది. ససూర్ ఖదేరీ నది ఉప్పొంగడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు తెలిపారు. ఇంకా వర్షం కూడా కురుస్తోందని, చాలా ఇబ్బందిగా ఉందన్నారు.
మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ సమీక్ష
ఉత్తరప్రదేశ్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ఆదివారం హమీర్‌పూర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారి కోసం చేసిన ఏర్పాట్లను కూడా సమీక్షించారు. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని తెలిపారు.
అఖిలేష్ యాదవ్ విమర్శలు
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రయాగ్‌రాజ్‌లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కోసం 20 వేల కోట్లు ఖర్చు చేసినా, నీటి నిల్వ తప్ప ఏం సాధించారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అవినీతి గుండాల్లో నీరు నిండిపోయింది. స్మార్ట్ సిటీ అనే ఆలోచనను నీళ్లలో కలిపేసిన బీజేపీ వాళ్లు ఎక్కడికి పడవలు తీసుకొని పారిపోయారని తనదైన శైలిలో ప్రశ్నించారు.
వాతావరణ హెచ్చరిక
రాష్ట్రంలో మరో 24 గంటలపాటు ఈదురు గాలులతోకూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ హెచ్చరించింది. ఈ క్రమంలో లక్నో, వారణాసి, గోరఖ్‌పూర్, మౌ, బలియా, సోన్‌భద్ర, మీర్జాపూర్, జౌన్‌పూర్, ఘాజిపూర్, కుషీనగర్, సీతాపూర్, బరాబంకీ, బహ్రైచ్, గోండా, లఖింపూర్ ఖేరీ, మొరాదాబాద్ వంటి 55 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో బహ్రైచ్, బలరాంపూర్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, గోండా, శ్రావస్తి లాంటి ఉత్తర జిల్లాల్లో కూడా వరద పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి