డీజే చిచ్చరపిడుగు.. డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లాల్సిందే..
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:28 PM
తలపై క్యాప్‌తో క్యూట్‌గా కనిపించే రినోకాను... వైర్లు, స్విచ్‌లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ ముందు చూసి... సరదాగా కూర్చుందనుకుంటారు ఎవరైనా. కానీ ఆ చిన్నారి డీజే కొట్టిందంటే... డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లాల్సిందే. కాస్త బేస్ పెంచితే... ఏకంగా బాక్సులు బద్దలవ్వాల్సిందే.

తలపై క్యాప్‌తో క్యూట్‌గా కనిపించే రినోకాను... వైర్లు, స్విచ్‌లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ ముందు చూసి... సరదాగా కూర్చుందనుకుంటారు ఎవరైనా. కానీ ఆ చిన్నారి డీజే కొట్టిందంటే... డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లాల్సిందే. కాస్త బేస్ పెంచితే... ఏకంగా బాక్సులు బద్దలవ్వాల్సిందే.
జపాన్‌కు చెందిన ఈ చిచ్చరపిడుగు వయసు ఏడేళ్లు. సాధారణంగా ఈ వయసు పిల్లలు ఎంచక్కా ఆడుతూపాడుతూ గడిపేస్తుంటారు. అయితే రినోకా మాత్రం ‘యంగెస్ట్ క్లబ్ డీజే (ఫిమేల్)’గా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
టీవీలో చూసి...
ఒకరోజు సాయంత్రం రినోకా హోమ్‌వర్క్ పూర్తి చేసుకుని, టీవీ చూస్తోందట. ఆ కార్యక్రమంలో ఒక అమ్మాయి డీజే ఆపరేట్ చేయడం తనను బాగా ఆకట్టుకుంది. ఆ క్షణమే తను కూడా డీజే కావాలని నిర్ణయించుకుంది. అయితే, అనుకోకుండా 2022లో క్రిస్మస్ సందర్భంగా శాంతాక్లాజ్ నుంచి రినోకాకు విచిత్రంగా డీజే కిట్ బహుమతిగా అందిందట. అప్పటి నుంచి ప్రతీరోజూ బడి నుంచి వచ్చాక ప్రాక్టీసు చేయడం మొదలెట్టింది. అలా కొద్ది నెలల్లోనే డీజే ప్లే చేయడంలో మెలకువలు నేర్చేసుకుంది. ఆ తర్వాత వరుసపెట్టి ప్రదర్శనలు ఇవ్వడం మొదలెట్టింది.
ఓ క్లబ్‌లో దాదాపు వంద మంది ఎదుట నిరాటకంగా గంటసేపు డీజే ఆపరేట్ చేసింది. ఈ విషయం గిన్నిస్ బుక్ ప్రతినిధులకు తెలిసింది. దాంతో అతి పిన్న క్లబ్ డీజేగా నమోదు చేసుకుని, రికార్డు అందించారు. ‘‘ప్రతీ ప్రదర్శనకు నాలోని సృజనాత్మకత మరింత మెరుగయ్యేది. నేను రూపొందించే సంగీతం ప్రేక్షకుల్ని అలరించేది.. ఉర్రూతలూగించేది. వాళ్ల ప్రోత్సాహమే నాకు ఇంతటి గుర్తింపు తెచ్చిపెట్టింది’’ అంటోంది రినోకా. క్లబ్‌లో రకరకాల ఇష్టాలున్న అంతమందిని సంగీతంతో ఉర్రూతలూగించాలంటే ఒక్కోసారి సీనియర్లకే కష్టం. అయితే ‘డీజే ప్లే చేయడం మాత్రమే వస్తే సరిపోదని, వారి మూడ్‌కు తగిన విధంగా పాటలను ఒకదాని వెంట మరొకటి ఎంపిక చేసుకుని, డ్యాన్స్ ఫ్లోర్‌ను బిజీగా ఉంచడం కూడా ముఖ్యమేన’ని చెబుతోందీ చిన్నారి.
అనేక విద్యలు...
చదువు, డీజే మాత్రమే కాదు.. ఇంకా చాలా ఆసక్తులు ఉన్నాయట ఈ చిచ్చరపిడుక్కి. స్కేట్‌బోర్డింగ్, డాన్స్‌తోపాటు కీబోర్డు వాయించడం కూడా నేర్చుకుంటోంది. వారానికి ఒకసారి మాత్రం స్నేహితులతో కలిసి కాసేపు సరదాగా ఆడుకుంటుందట. ఏదేమైనా చిన్న వయసులోనే తన డీజేతో అందర్నీ ఉర్రూత లూగిస్తున్న రినోకా ఈ రంగంలో మరెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.