Nitin Gadkari: పదవితో అహంకారం పెరుగుతుంది
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:50 AM
పదవులు, సంపద, విజ్ఞానం, అందం లభించినప్పుడు వ్యక్తుల్లో అహంకారం పెరిగిపోతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

ఇతరులపై ఆధిపత్యానికి యత్నం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు
బీజేపీ అధిష్ఠానం గురించే: విపక్షాలు
ముంబై, జూలై 13: పదవులు, సంపద, విజ్ఞానం, అందం లభించినప్పుడు వ్యక్తుల్లో అహంకారం పెరిగిపోతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శనివారం ఆయన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అంగీకరించిన నాయకులు ఎన్నడూ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించరని గడ్కరీ పేర్కొన్నారు. ‘‘అధికారంతో తాము అత్యంత తెలివైన వాళ్లుగా మారామని భావించడం మొదలయ్యాక.. ఇతరులపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. వినయాన్ని చూపే నాయకులు సహచరుల్లో గౌరవభావంతో ఉంటారు. ఈ చర్య బృంద సహకారానికి దోహదపడుతుంది. విభిన్న ఆలోచనలకు అవకాశమిస్తుంది’’అన్నారు. విద్యాశాఖలో ఉపాధ్యాయుల నియామకాల కోసం కొందరు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే గడ్కరీ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. విపక్షాలు ఆ వ్యాఖ్యలను బీజేపీ అధిష్ఠానంపై గురిపెట్టిన మాటలుగా పేర్కొంటున్నాయి.