Siddharamaiah: నాయకత్వ మార్పు ఊహాగానాలు.. మీడియాకు ముఖం చాటేసిన సిద్ధరామయ్య
ABN , Publish Date - Nov 10 , 2025 | 06:24 PM
కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు దివంగత మాజీ ముఖ్యమంత్రి డి దేవరాజ అర్స్ (D Devaraja Urs)కు ఉంది. ఆయన సుమారు 7.6 సంవత్సరాలు అంటే 2,792 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఎప్పుడు తన స్వస్థలం మైసూరు (Mysuru) వచ్చినా విమానాశ్రయం వద్ద మీడియాతో ముచ్చటించడం ఆనవాయితీ. అయితే తొలిసారి ఆయన సోమవారంనాడు మైసూరు విమానశ్రయం వద్ద మీడియాను కలవకుండానే వెళ్లిపోయారు. కర్ణాటకలో సీఎం మార్పు జరుగనుందనే ఊహాగానాల నేపథ్యంలో సీఎం తొలిసారి మీడియాకు ముఖం చాటేయడం ఆసక్తికరంగా మారింది.
సిద్ధరామయ్య మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి (2013-18) ఎప్పుడు మైసూరులో అడుగుపెట్టినా విమానాశ్రయం వద్ద మీడియాతో సంభాషించడం పరిపాటి. సీఎం తాజా షెడ్యూల్ ప్రకారం మైసూరులో ఆయన రెండ్రోజుల పర్యటన జరపనున్నారు. మైసూరులోనే రాత్రి బస చేసి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి బెంగళూరు బయలుదేరుతారు. మీడియాకు ఈ విషయం తెలియజేసిన సమాచార, ప్రజాసంబంధాల శాఖ వారికోసం ఉదయం 9.30 గంటలకు ఒక వాహనం కూడా ఏర్పాటు చేసింది. సీఎం 10.25 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే మీడియాతో మాట్లాడకుండానే ఆయన ముందుకు వెళ్లిపోయారు.
ఊహాగానాలకు ఊతం
కర్ణాటకలో సీఎం మార్పు, క్యాబినెట్ పునర్వవస్థీకరణ జరగనుందంటూ కొద్దికాలం వినిపిస్తున్న ఊహాగానాల మధ్య సీఎం చర్య మరోసారి చర్చనీయాంశమైంది. ముందుగా ఇచ్చిన హామీకి అనుగుణంగా పార్టీ ఏ క్షణంలోనైనా తనకు సీఎంగా అవకాశం కల్పిస్తుందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆయన సోమవారంనాడు ఢిల్లీలోనే ఉన్నారు. నవంబర్ 14న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటక కాంగ్రెస్‌లోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయనే ప్రచారం కూడా బలంగానే ఉంది.
కాగా, కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు దివంగత మాజీ ముఖ్యమంత్రి డి దేవరాజ అర్స్ (D Devraja Urs)కు ఉంది. ఆయన సుమారు 7.6 సంవత్సరాలు అంటే 2,792 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2026 జనవరి 6వ తేదీ నాటికి సిద్ధరామయ్య ఆ రికార్డును సమం చేసే వీలుంది. సెకెండ్ టర్మ్‌లోనూ ఇదేళ్ల పాటు పూర్తికాలం సీఎంగా కొనసాగాలని సిద్ధరామయ్య పట్టుదలతో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..
ఆ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో ఇకపై వందేమాతరం పాడాల్సిందే.!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి