Mohan Bhagwat: హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్
ABN , Publish Date - Nov 09 , 2025 | 03:01 PM
ఆర్ఎస్ఎస్ భారత త్రివర్ణ పతాకాన్ని గౌరవించదని, కాషాయం జెండాలను మాత్రమే గౌరవిస్తుందని కొందరి అభిప్రాయంగా ఉందని అడిగినప్పుడు, ఆర్ఎస్ఎస్లో కాషాయాన్ని గురువుగా భావిస్తామని, భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎంతగానో గౌరవిస్తామని మోహన్ భాగవత్ చెప్పారు.
బెంగళూరు: దేశానికి సేవ చేస్తున్నామని చెబుతున్న సంఘ్ ఇంతవరకూ ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదంటూ కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) ఘాటుగా స్పందించారు. 1925లో సంఘ్ ఏర్పాటైనట్టు నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో అధికారికంగా నమోదు చేయించాలా అని ప్రశ్నించారు. హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదని, తాము కూడా ప్రత్యేకంగా రిజిస్టర్ చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
'స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ను అధికారికంగా నమోదు చేసుకోవడాన్ని భారతదేశం తప్పనిసరి చేయలేదు. ఆదాయం పన్ను శాఖ, కోర్టులు కూడా ఆర్ఎస్ఎస్ను వ్యక్తుల సంఘంగా గుర్తించాయి. ఆదాయం పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాయి' అని మోహన్ భాగవత్ తెలిపారు. '100 ఇయర్స్ ఆఫ్ సంఘ్ జర్నీ: న్యూ హారిజాన్స్' అనే అంశంపై ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఇన్-హౌస్ సెషన్లో మోహన్ భగవత్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ అయిన సంస్థ కాదని కొందరు అంటున్నారని, ఆర్ఎస్ఎస్పై మూడు సార్లు నిషేధం విధించారంటే ప్రభుత్వం తమను గుర్తించినట్టే కదా అని అన్నారు. ఆర్ఎస్ఎస్కు గుర్తింపు లేకుంటే వాళ్లు ఎవరిని బ్యాన్ చేసినట్టు? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించిన ప్రతిసారి కోర్టులు ఆ నిషేధాన్ని కొట్టివేసినట్టు గుర్తుచేశారు. లీగల్‌గా ఆర్ఎస్ఎస్ ఒక సంస్థ అని, రాజ్యాంగేతర సంస్థ కాదని చెప్పారు. అందువల్ల రిజిస్ట్రేషన్ అవసరం లేదని తెలిపారు. హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు కాలేదని వివరించారు.
హిందువులకు మాత్రమే..
ఆర్ఎస్ఎస్ భారత త్రివర్ణ పతాకాన్ని గౌరవించదని, కాషాయం జెండాలను మాత్రమే గౌరవిస్తుందని కొందరి అభిప్రాయంగా ఉందని అడిగినప్పుడు, ఆర్ఎస్ఎస్లో కాషాయాన్ని గురువుగా భావిస్తామని, భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎంతగానో గౌరవిస్తామని చెప్పారు. తమకు మువ్వన్నెల జెండాపై ఎంతో గౌరవం, విధేయతతో పాటు పతాక పరిక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆర్ఎస్ఎస్లో హిందువులను మాత్రమే అనుమతిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. హిందూ అనేది మతం కాదని, భారతదేశానికి చెందిన ప్రతి ఒక్కరూ హిందువులేనని అన్నారు. బ్రాహ్మణులు కానీ ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ తాము వేరనే భావన వదలి భరతమాత బిడ్డలుగా ముందుకు వస్తే వారిని ఆర్ఎస్ఎస్ శాఖల్లో చేర్చుకునేందుకు స్వాగతిస్తామని చెప్పారు. 'మీ ప్రత్యేకతను స్వాగతిస్తాం. కానీ శాఖలోకి వచ్చినప్పుడు భరతమాత బిడ్డలుగా, హిందూ సమాజ సభ్యులుగా రావాలి' అని స్పష్టం చేశారు.
బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తామంటే..
బీజేపీకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్‌పై మాట్లాడుతూ, రామాలయం కట్టేందుకు ఆ పార్టీ చొరవ తీసుకోవడమే కారణమని చెప్పారు. నిర్దిష్ట కారణం ఆధారంగా సంఘ్ సపోర్ట్ ఉంటుందని, పార్టీని బట్టి కాదని చెప్పారు. రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ చేపట్టి ఉంటే వాళ్లకు కూడా ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చి ఉండేదన్నారు. రాజకీయ పార్టీలు సంఘ్ పరివార్‌ను అంగీకరించవని, డోర్లు మూసేస్తుంటాయని, బీజేపీ మాత్రమే ఆర్ఎస్ఎస్కు తలుపులు తెరిచిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
గుజరాత్లో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్
పిల్లలకు వారు తుపాకులిస్తే.. మేం ల్యాప్‌టాప్ ఇస్తున్నాం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి