Share News

Alleged Land Deal Controversies: మహారాష్ట్ర మంత్రుల మెడకుభూ కొనుగోళ్ల ఉచ్చు

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:32 AM

మహారాష్ట్రలో మంత్రులకు సంబంధం ఉన్న భూమి కొనుగోలు వ్యవహారాలు వెలుగులోకి రావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇవి కేవలం కొనుగోళ్లు కావని, కుంభకోణాలంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి....

Alleged Land Deal Controversies: మహారాష్ట్ర మంత్రుల మెడకుభూ కొనుగోళ్ల ఉచ్చు

  • అక్రమాలు జరిగాయన్న విపక్షాలు

  • అజిత్‌పవార్‌ కుమారుడి 40 ఎకరాల కొనుగోలు రద్దు

  • ఐనా క్యాన్సిలేషన్‌ చార్జీల కింద సర్కారుకు 41 కోట్లు

  • రవాణా మంత్రి ప్రతాప్‌ పైనా అక్రమ భూ కొనుగోళ్ల ఆరోపణ

  • ముంబైలో 4 ఎకరాలు కేవలం 3 కోట్లకేనా?: కాంగ్రెస్‌

ముంబై, నవంబరు 8: మహారాష్ట్రలో మంత్రులకు సంబంధం ఉన్న భూమి కొనుగోలు వ్యవహారాలు వెలుగులోకి రావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇవి కేవలం కొనుగోళ్లు కావని, కుంభకోణాలంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, రవాణా మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌లపై ఆరోపణలు వస్తున్నాయి. తొలుత పుణెలో అజిత్‌ పవార్‌ కుమారుడు పార్థపవార్‌ 40 ఎకరాలు కొనుగోలు చేయడం వివాదాస్పదమయింది. విమర్శల నేపథ్యంలో సేల్‌ డీడ్‌ను రద్దు చేసుకున్నప్పటికీ ‘డబుల్‌ స్టాంప్‌ డ్యూటీ’ కింద ప్రభుత్వానికి రూ.42 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సేల్‌ డీడ్‌ను రద్దు చేసుకున్నట్టు ‘క్యాన్సిలేషన్‌ డీడ్‌’ను రాసుకుంటే ప్రభుత్వానికి రెట్టింపు స్టాంప్‌ డ్యూటీ చెల్లించాలన్న నిబంధన ఉండడంతో ఇంత భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. పార్థ పవార్‌ తన సమీప బంధువు దిగ్విజయ్‌ పాటిల్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఆమదియా ఎంటర్‌ప్రైజెస్‌ తరఫున డాటా సెంటర్‌ నెలకొల్పడానికి పుణెలోని ముంధ్వా ప్రాంతంలో 40 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ స్థలానికి యజమానులైన 272 మంది శీతల్‌ తేజస్వీని అనే మహిళకు పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇవ్వడంతో ఆమెతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సేల్‌ డీడ్‌ను సబ్‌ రిజిస్ట్రార్‌ ఆర్‌.బి. తరు రిజిస్టర్‌ చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని, రూ.1,800 కోట్లు విలువ చేసే భూమిని రూ.300 కోట్లకే కొనుగోలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. పరిస్థితిని గమనించిన అజిత్‌ పవార్‌ అది ప్రభుత్వ భూమి అని తన కుమారుడికి తెలియదని శుక్రవారం చెప్పారు.


సేల్‌ డీడ్‌ను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. డాటా సెంటర్‌ కోసం భూమి కొనుగోలు చేస్తున్నామని చెప్పడంతో సబ్‌ రిజిస్ట్రార్‌ పన్ను వసూలు చేయలేదు. వాస్తవానికయితే 7 శాతం పన్ను (5 శాతం స్టాంప్‌ డ్యూటీ, ఒక శాతం స్థానిక సంస్థల పన్ను, ఒక శాతం మెట్రో సెస్‌) వసూలు చేయాల్సి ఉంది. ఆ లెక్కన రూ.21 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.500 మాత్రమే చెల్లించడం గమనార్హం. ఇప్పుడు ఆ సేల్‌ డీడ్‌ను రద్దు చేయడంతో ఆ 7 శాతంతో పాటు, మరో 7 శాతం పరిహారంగా చెల్లించాల్సి ఉంది. రూ.300 కోట్లకుగానూ రూ.42 కోట్లు చెల్లించాల్లి ఉంటుంది. ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే సేల్‌ డీడ్‌ను రద్దు చేస్తారు. ప్రభుత్వభూమిని కోనుగోలు చేయడం, రిజిస్టర్‌ చేయడం అక్రమమని ఆరోపిస్తూ రిజిస్ట్రేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దిగ్విజయ్‌ పాటిల్‌, శీతల్‌ తేజస్విని, సబ్‌ రిజిస్ట్రార్‌ తరులపై కేసు నమోదు చేశారు. భూమి రిజిస్ట్రేషన్‌ సమయంలో పార్థ పాటిల్‌ లేకపోవడంతో ఆయనపై కేసు పెట్టలేదు. వతన్‌దారీ రద్దు చట్టం కింద 1958లో మహర్‌ సామాజిక వర్గానికి వారికి ఈ భూమిని ఇచ్చినట్టు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. మొత్తం వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని ఎన్‌సీపీ (ఎస్‌పీ) నాయకుడు శరద్‌ పవార్‌ డిమాండు చేయడం గమనార్హం. రవాణా మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌ ముంబయిలోని మీరా భయాందర్‌లో రూ.200 కోట్లు విలువ చేసే నాలుగెకరాల భూమిని కేవలం రూ.3 కోట్లకు కొనుగోలు చేశారని కాంగ్రెస్‌ నాయకుడు విజయ్‌ వాడెట్టివార్‌ ఆరోపించారు. విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి దాన్ని కొనుగోలు చేశారని విమర్శించారు. ముంబయిలో అంత తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేయగలరని ప్రశ్నించారు. ఈ ఆరోపణలను మంత్రి ఖండించారు.

Updated Date - Nov 09 , 2025 | 01:32 AM