EPS: ఎన్నికల్లో మా వ్యూహాలు బయటకు చెప్పలేం..
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:19 AM
డీఎంకేను ఓడించాలనుకునే పార్టీలన్నీ ఏకేతాటిపైకి రావాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పిలుపునిచ్చారు. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తుపై మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహాలు ఇప్పుడే బయటకు చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు. పళనిస్వామి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

- డీఎంకేని ఓడించడమే లక్ష్యం
- అన్ని పార్టీలూ ఏకం కావాలి
- అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్
చెన్నై: డీఎంకేను ఓడించాలనుకునే పార్టీలన్నీ ఏకేతాటిపైకి రావాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) పిలుపునిచ్చారు. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తుపై మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహాలు ఇప్పుడే బయటకు చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు. పళనిస్వామి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో అన్నాడీఎంకే అధికారం చేపడుతుందన్నారు. 50 నెలల డీఎంకే పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు, హత్యలు, అత్యాచారాలు, నేరాలు అధికమయ్యాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న ఇలాంటి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో లేదన్నారు. మక్కల్ కాప్పోం...తమిళగై మీడ్పోం అనే నినాదంతో ఈ నెల 7వ తేది నుంచి రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించే కార్యక్రమం ప్రారంభించానని తెలిపారు. తను వెళ్లిన ప్రతి చోట ప్రజలు నీరాజనాలు పడుతున్నారని, ద్రావిడ మోడల్ పాలనతో విసిగిపోయిన ప్రజలు, అన్నాడీఎంకేకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తన ప్రచారంతో తెలిసిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం...
అన్నాడీఎంకే ప్రాంతీయ పార్టీ అని, రాష్ట్రంలో అమలుచేసే పథకాలకు కేంద్ర ప్రభు త్వం సహకారం కూడా తప్పనిసరి అన్నారు. జాతీయస్థాయిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉందని, ఈ పార్టీ నేతృత్వంలోని కూటమి కేంద్రంలో అధికారంలో ఉందన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు డీఎంకే ప్రభు త్వం కారణమన్నారు. ఒక కుటుంబం చేతిలో రాష్ట్ర అధికారం నిక్షిప్తమై ఉందని ఆరోపించారు.ఈ అసమానత ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతోనే బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలని నిర్ణయించామని తెలిపారు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలు ఉంటాయన్నారు.
డీఎంకేను గద్దె దించాలని లక్ష్యంతో ఉన్న పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఆ విషయం ప్రధాన అంశంగా తాము భావించలేదని తెలిపారు. దేశంలోనే బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉండడంతో పాటు ఆ పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2024 ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీచేసి తమ బలాన్ని నిరూపించుకున్నామన్నారు. ఈ సారి డీఎంకేను ఓడించాలనే లక్ష్యంగా ఉన్నామని తెలిపారు. డీఎంకే కూటమిలోని డీపీఐ, వామపక్షాలు, ఇతర పార్టీలు తమ కూటమిలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. విజయ్ నేతృత్వంలోని పార్టీతో పొత్తు కుదుర్చుకునే పక్షంలో బీజేపీకి దూరమవుతారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమ వ్యూహాలు తమకున్నాయని, వాటి గురించి ఇప్పుడే బయటకు చెప్పలేమన్నారు.
పార్టీలో 46 ఏళ్లుగా...
అన్నాడీఎంకే పార్టీలో 46 ఏళ్ల క్రితం తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ‘పురచ్చితలైవర్’ ఎంజీఆర్, ‘పురచ్చితలైవి’ జయలలిత చూపిన బాటలో రాష్ట్రంలో మళ్లీ అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. పార్టీ కార్యకర్తలు కూడా ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. పార్టీలో ప్రస్తుతం 2 కోట్ల మంది సభ్యులున్నారని, సభ్యుల సంఖ్యలో దేశంలో మూడో అతిపెద్ద పార్టీగా, రాష్ట్రంలో తొలి పార్టీగా ఉన్న అన్నాడీఎంకే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడం తథ్యమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News