Anil Ambani ED raids: అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ దాడులు
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:30 AM
మూడువేల కోట్ల రూపాయల బ్యాంకు రుణ మోసం, నగదు అక్రమ చలామణీ కేసు దర్యాప్తులో భాగంగా..

3,000 కోట్ల బ్యాంకు రుణం ఎగవేత, నగదు అక్రమ చలామణీ ఆరోపణలపై 35 కార్యాలయాల్లో సోదాలు
2017-19 నడుమ ‘ఎస్ బ్యాంకు’ నుంచి రుణాలు తీసుకుని ఆ సొమ్మును దారి మళ్లించినట్టు ఆరోపణలు
న్యూఢిల్లీ, జూలై 24: మూడువేల కోట్ల రూపాయల బ్యాంకు రుణ మోసం, నగదు అక్రమ చలామణీ కేసు దర్యాప్తులో భాగంగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కంపెనీలు, ఎస్ బ్యాంకుకు చెందిన 35 కార్యాలయాలపై దాడులు చేశారు. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం కింద 25 మందిని ప్రశ్నించారు. ఆయా కార్యాలయాల నుంచి పలు పత్రాలు, కంప్యూటర్ ఉపకరణాలను (ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్కులు, పెన్‌డ్రైవ్‌ల వంటివి) స్వాధీనం చేసుకున్నారు. 2017-2019 మధ్య ‘ఎస్ బ్యాంకు’ అధికారులకు రిలయన్స్ గ్రూపు కంపెనీలు లంచా లు ఇచ్చి.. ఆ బ్యాంకు నుంచి రూ.3000 కోట్ల మేర రుణాలు పొంది, ఆ రుణాలను అక్రమంగా దారి మ ళ్లించాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఆ రుణాల మంజూరుకు ఎస్‌బ్యాంకు వర్గాలు పలు నిబంధనలను ఉల్లంఘించాయని.. పాతతేదీతో రూపొందించిన రుణ మంజూరు గుర్తింపు పత్రాల ను ఉపయోగించాయని.. మంజూరైన రుణాలను రిలయన్స్ గ్రూప్‌లోని పలు ఇతర సంస్థలకు, షెల్ కంపెనీలకు మళ్లించారని ఆరోపణలు రావడంతో.. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) 2022 సెప్టెంబరులో రెండు కేసులు నమోదు చేసిం ది. ఈ రెండు కేసుల్లోనూ ఎస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు, ఆ బ్యాంకు మాజీ ఎండీ రాణా కపూర్ పేరును సీబీఐ ప్రస్తావించింది. సీబీఐ పెట్టిన రెండు కేసులతోపాటు.. ఈ వ్యవహారానికి సంబంధించి నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెబీ, నేషనల్ ఫైనాన్షియ ల్ రిపోర్టింగ్ అథారిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. బ్యాంకులను, షేర్‌హోల్డర్స్‌ను, ఇన్వెస్టర్లను, ఇతర ప్రభుత్వ సంస్థలను మోసం చేసి ప్రజాధనాన్ని దారి మళ్లించడానికి పక్కా ప్రణాళికతో ఈ ఫ్రాడ్‌కు రూపకల్పన చేసినట్టు ఆయా సంస్థలు ఇచ్చిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అప్పట్లో రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు రుణం మంజూరు కావడానికి ముందే.. ఎస్ బ్యాంకు ప్రమోటర్లు ‘నగదు (లంచం)’ అందుకున్నట్టుగా ఈడీ తన ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఎస్‌బ్యాంకు వద్దే కాదు.. కెనరా బ్యాంకు వద్ద సైతం ఆర్‌కామ్ ఇదే తరహాలో లంచాలిచ్చి రూ.1050 కోట్లకు పైగా రుణాలను పొందిన వైనంపైనా ఈడీ దృష్టి పెట్టినట్టు సమాచారం. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థ బ్యాంకులు జారీ చేసే ఏటీ-1 (అడిషనల్ టైర్-1) బాండ్లలో రూ.2850 కోట్ల దాకా పెట్టుబడి పెట్టిందని.. అందుకు బదులుగా ఆయా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని (‘క్విడ్ ప్రో కో’గా) ఈడీ భావిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. కాగా.. ఈడీ సోదాలతో తమ వ్యాపార కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావమూ పడలేదని రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీలు వేర్వేరు ప్రకటనలు చేశాయి. ఈడీ సోదాలకు సంబంధించి మీడియా కథనాల్లో పేర్కొంటున్న ఆరోపణలు రిలయన్స్ కమ్యూనికేన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) లేదా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎ్‌ఫఎల్) పదేళ్ల క్రితం జరిపిన లావాదేవీలకు సంబంధించినవని వెల్లడించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‌లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News